వైద్యం అందక కొడుకు క‌ళ్లెదుటే చ‌నిపోయిన క‌న్నతల్లి

  • Published By: bheemraj ,Published On : July 5, 2020 / 12:13 AM IST
వైద్యం అందక కొడుకు క‌ళ్లెదుటే చ‌నిపోయిన క‌న్నతల్లి

ఉత్తరప్రదేశ్ లో హృద‌య‌విదార‌క ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. త‌ల్లి అనారోగ్యానికి గుర్వడంతో ఆస్ప‌త్రికి తీసుకెళ్లాడు. కానీ అక్క‌డ ఎవ‌రూ లేరు. ఇక్క‌డ ఎవ‌రైనా ఉన్నారా అని నోరు పోయేలా మొత్తుకున్నా ఎవ‌రూ స్పందించ‌లేదు. చివ‌ర‌కు కుమారుడి క‌ళ్లెదుటే క‌న్న త‌ల్లి చ‌నిపోయింది. త‌ల్లి మృత‌దేహం వ‌ద్ద కుమారుడు గుండెల‌విసేలా రోధించాడు.

హ‌ర్దోయి జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి అనారోగ్యానికి గురైన త‌న త‌ల్లిని తీసుకుని స‌వాయిజౌర్ క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ కు తీసుకెళ్లాడు. అక్క‌డ ఆస్ప‌త్రి త‌లుపులు మూసి ఉండ‌టంతో ఫ్లోర్ పై త‌ల్లిని ప‌డుకోబెట్టాడు. కాపాడండి అంటూ త‌లుపులు కొట్టాడు.. ఇక్క‌డ ఎవ‌రైనా ఉన్నారా అంటూ.. అటు ఇటు తిరిగాడు. చివ‌ర‌కు కిటికీ అద్దాల‌పై చేయితో బాది.. ఆదుకోండి అంటూ అరిచాడు. ఎవ‌రూ స్పందించ‌లేదు. అప్ప‌టికే త‌ల్లి ప్రాణాలు కోల్పోయింది. త‌ల్లి మృత‌దేహం వ‌ద్ద కుమారుడు కంట‌త‌డి పెట్టిన తీరు అంద‌రి మ‌న‌సుల‌ను క‌లిచివేస్తోంది.

ఈ ఘ‌ట‌న‌పై ఆస్ప‌త్రి వ‌ర్గాలు స్పందించాయి. స‌రైన గేటు నుంచి అత‌ను ఆమెను ఆస్ప‌త్రికి తీసుకురాలేదు అని తెలిపారు. దీని వ‌ల్ల సిబ్బంది.. వారిని గ‌మ‌నించ‌లేదు. స‌కాలంలో వైద్యం చేయ‌లేక‌పోయారు. ఆస్ప‌త్రి కార్య‌క‌లాపాలు ముగిసిన త‌ర్వాత ప్ర‌ధాన గేటును మూసివేశామ‌న్నారు. గ‌ర్భిణీలు, అత్య‌వ‌స‌ర రోగుల‌కు వెనుక గేటు ఉప‌యోగిస్తున్నామ‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి.