టూల్‌కిట్ కేసులో ఐఎస్‌ఐ పాత్ర!

టూల్‌కిట్ కేసులో ఐఎస్‌ఐ పాత్ర!

the role of ISI in the toolkit case : ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న టూల్‌కిట్ కేసు… అనేక మలుపులు తిరుగుతోంది. టూల్‌కిట్‌ వ్యవహారం వెనుక పాకిస్థాన్‌ లింకులు బయటపడుతున్నాయి. టూల్‌కిట్‌ కేసులో పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. కేసుకు సంబంధించి పీటర్‌ ఫ్రెడరిక్ అనే వ్యక్తి పాత్రపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐకి చెందిన ఇక్బాల్‌ చౌదరి కంపెనీలో పీటర్‌ పేరు వెలుగుచూడటంతో అతడిపై 2006 నుంచి దర్యాప్తు సంస్థలు నిఘా వేసి ఉంచాయి. ఇప్పుడు డాక్యుమెంట్‌లో పీటర్‌ పేరు ఎందుకుందన్న దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. సహజంగానే మోడీ వ్యతిరేకి అయిన పీటర్ బహిరంగంగానే చాలా సార్లు మోడీ ప్రభుత్వాన్ని తప్పు బట్టారు. అమెరికాలో గతేడాది మోడీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ కూడా నిర్వహించాడు.

సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న కొంతమంది వ్యక్తులు ఈ టూల్‌కిట్‌ను బాగా స్ప్రెడ్ చేసేందుకు ముందుకొచ్చారని పోలీసులు చెప్పారు. టూల్‌కిట్‌ వ్యాప్తికి హాష్ ట్యాగ్స్‌ను రూపొందించడంలో పీటర్ ఫ్రెడరిక్ కీలకంగా వ్వవహరించినట్లు తెలిపారు. అయితే దిశా, నికితాలతో ఫ్రెడరిక్ డైరెక్ట్‌గా టచ్‌లో ఉన్నాడా లేదా అన్నది విచారణలో తేలాల్సి ఉందన్నారు. ఈ టూల్‌కిట్‌లో గూగుల్ డాక్యుమెంట్స్‌ను పొందుపరిచిన కొన్ని హైపర్ లింక్స్ ఉన్నాయని… ఇందులో చాలావరకూ ఖలీస్తానీ ఉద్యమానికి సంబంధించివే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ప్రస్తుతం పీటర్‌ ప్రెడరిక్‌ మలేషియాలో ఉన్నాడు. ఫాసిజంపై పరిశోధనలు చేస్తున్నాడు. గతేడాది అమెరికాలో జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహాన్ని కూల్చిన ఘటనలో పీటర్‌ కూడా ఉన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. పీటర్‌ ఖలీస్తానీ ఉద్యమానికి మద్దతుదారు కూడా. అతడికి ఖలీస్తాన్‌ గ్రుపులతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. అందులోనూ పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐకి గూఢచారిగా ఉన్నాడనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో పీటర్‌పై ఢీల్లీ పోలీసులు స్పెషల్ ఫోకస్‌ పెట్టారు. అతడికి టూల్‌ కీట్ వ్యవహారంలో లీంకులపై ఆరా తీస్తున్నారు.

రైతుల ఆందోళనకు మద్దతుగా రూపొందించిన టూల్‌ కిట్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే దిశ రవితో పాటు నికిత జాకబ్‌, శంతను అరెస్ట్ చేశారు. ఖలిస్థాన్‌ అనుకూల పొయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌తో జనవరి 11న జూమ్‌లో నిర్వహించిన సమావేశానికి నికిత, శంతనులు హాజరైనట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. భారత ప్రతిష్టను మసకబార్చడమే లక్ష్యంగా వీరంతా టూల్‌ కిట్‌ రూపొందించారని పోలీసులు తెలిపారు.

శంతను ఈ-మెయిల్‌ ఖాతా నుంచే ఈ గూగుల్‌ పత్రం రూపొందినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో ఐఎస్‌ఐకు చెందిన కే2 డెస్క్‌తో సంబంధాలున్న ఫ్రెడరిక్‌ పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరి టూల్‌కిట్ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుందోనన్న దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.