మూడు చట్టాలను పక్కనపెట్టండి..లేదంటే మేమే ఆ పని చేస్తాం

మూడు చట్టాలను పక్కనపెట్టండి..లేదంటే మేమే ఆ పని చేస్తాం

The Supreme Court dissatisfied over Central Government : రైతులతో కేంద్రం చర్చలు జరిపిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతుల సమస్యను ఇప్పటి వరకు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించింది. కేంద్రం రైతులతో ఏ తరహా చర్చలు జరిపారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది అత్యున్నత ధర్మాసనం. చీఫ్ జస్టిస్‌ వేసిన ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెబుతోంది. చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సమస్య మరింత జఠిలతరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు చీఫ్‌ జస్టిస్ బోబ్డే.

పరిస్థితి చేయిదాటిపోతున్నా సమస్యను ఎందుకు పరిష్కరించలేదని నిలదీసింది. వ్యవసాయ చట్టాలను ఎందుకు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. నిపుణల కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు. సమస్య పరిష్కారమయ్యేంత వరకు చట్టాలను కొంతకాలం పక్కన పెట్టలేరా అని ప్రశ్నించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఆ మూడు చట్టాలను పక్కన పెట్టండి..లేదంటే తామే ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.

కొత్త సాగు చట్టాలు, రైతుల నిరసనలపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లు, రైతుల ఆందోళనలపై దాఖలైన పిటీషన్లను జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నెల 7న రైతు సంఘాలతో కేంద్రం జరిపిన ఎనిమిదవ విడత చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 15న మరో దఫా చర్చలు జరగనున్నాయి. చట్టాలను వెనక్కి తీసుకుంటేనే ఉద్యమాన్ని విరమిస్తామని, లేదంటే ఎంతకాలమైనా.. పోరాటం కొనసాగిస్తామని ఇప్పటికే రైతు సంఘాలు స్పష్టం చేశాయి. రైతుల నిరసనలపై కేంద్రం ఎలాంటి పురోగతి సాధించలేదని ఇటీవలే ధర్మాసనం వ్యాఖ్యానించింది.

మరోవైపు.. హరియాణాలోని రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. అక్కడి ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కొత్త సాగు చట్టాల ప్రయోజనాలను వివరించి, రైతన్నలను శాంతింపజేసేందుకు ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది. ముఖ్యమంత్రి నిర్వహించతలపెట్టిన.. కిసాన్‌ మహాపంచాయత్‌ను రైతులు భగ్నం చేశారు.

ఇందుకోసం వారు పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా కదం తొక్కారు. జల ఫిరంగులకు, బాష్ప వాయువుగోళాలకు ఎదురొడ్డి మరీ అనుకున్నది చేసి చూపించారు అన్నదాతలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చేసేది లేక కిసాన్‌ మహా పంచాయత్‌ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. మహా పంచాయత్‌ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం తమ గాయాలపై కారం చల్లేందుకు ప్రయత్నిస్తోందని రైతులు తీవ్రంగా మండిపడ్డారు.