Cow Dung Treatment : ప్రాణం తీసిన మూఢ నమ్మకం..ఆవు పేడ ట్రీట్మెంట్ తో వ్యక్తి మృతి
మూఢ నమ్మకాలు ఓ వ్యక్తి ప్రాణాల్ని బలిగొన్నాయి.

Cow Dung Treatment
Cow Dung Treatment మూఢ నమ్మకాలు ఓ వ్యక్తి ప్రాణాల్ని బలిగొన్నాయి. ఓ కుటుంబానికి జీవనాధారం లేకుండా చేశాయి. పిడుగు పాటుకు గురైన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించకుండా ఆవు పేడలో ముంచి ట్రీట్మెంట్ చేశారు. ఫలితంగా అతడు ప్రాణాలు కోల్పాయాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సర్గజ్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది.
సర్గజ్ జిల్లాలోని ముత్కి గ్రామానికి చెందిన కిషన్ రామ్ రాజ్వాడా(35) మంగళవారం మధ్యాహ్నం వర్షం కురుస్తుండగా తన ఇంటి ముందు నిలిచిన నీళ్లను తీసేందుకు బయటకు వచ్చాడు. ఇంతలో అతడు పిడుగుపాటుకు గురయ్యాడు. పిడుగు శబ్దం విని కుటుంబ సభ్యులు అరవగా.. ఇరుగుపొరుగువారు, ఊరిపెద్దలు అక్కడకు చేరారు. అయితే తీవ్రంగా గాయపడ్డ అతడిని వెంటనే హాస్పిటల్ కు తరలించకుండా.. ఆవుపేడతో తమకు తోచిన ట్రీట్మెంట్ చేశారు. కిషన్ శరీరం మొత్తాన్ని పేడలో ముంచి తల భాగాన్ని మాత్రమే బయటకు వదిలేసి ఉంచారు.అరగంట పాటు కిషన్ ని ఆవు పేడలోనే ఉంచారు.
అలా చేస్తే అతడు కోలుకుంటాడు అని ఊహించారు. కానీ, వారి యత్నాలు ఫలించలేదు. కిషన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో 108కి ఫోన్ చేసి అంబులెన్సు ద్వారా ఉదయ్‌పుర్ లోని హాస్పిటల్ కు తరలించారు. అయితే, అప్పటికే కిషన్ మృతి చెందాడని అక్కడి డాక్టర్లు నిర్ధరించారు. పిడుగుపాటుకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా అతడిని హాస్పిటల్ కి తీసుకొచ్చుంటే బతికి ఉండేవాడని డాక్టర్లు తెలిపారు.