సాయం చేయకపోతిరి : ట్రాలీ బండిపై ఆస్పత్రికి రోగి.. మార్గంలోనే మృతి

10TV Telugu News

సకాలంలో వైద్యం అందక 65ఏళ్ల గిరిజన వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన పుదుచ్చేరిలోని ఓ గ్రామంలో జరిగింది. తన బంధువుల ఇంటికి వెళ్లిన వ్యక్తి ఉన్నట్టుండి కళ్లు తిరిగి కిందపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. చేసేదేం లేక కుటుంబ సభ్యులు ట్రాలీ బండిపై ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, మార్గం మధ్యలోనే బాధిత వ్యక్తి మృతిచెందాడు.

ట్రాలీపై లాక్కెళ్తున్న సమయంలో రోడ్డుపై వెళ్లే వారంతా ఫొటోలు తీస్తుండిపోయారే తప్ప కనీసం అంబులెన్స్ ఫోన్ చేయడం లేదా దగ్గరికి వెళ్లి సాయం చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతుడు.. తమిళనాడులోని విల్లుపురం జిల్లాకు చెందిన సుబ్రమణి అనే వ్యక్తిగా గుర్తించారు. పుదుచ్చేరిలోని తన బంధువుల ఇంటికి వెళ్లగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అప్పటికే అతడు క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు. 

సుబ్రమణి ఆరోగ్యం బాగా క్షీణించడంతో అక్కడిక్కడే కుప్పకూలి మృతిచెందినట్టు అతడి భార్య పోలీసులకు తెలిపింది. స్పృహ కోల్పోయిన తన భర్తను ఇతర బంధువుల సాయంతో ట్రాలీ బండిపై ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్టు చెప్పింది. ఆ సమయంలో వారి దగ్గర మొబైల్ నెంబర్ లేకపోవడంతో కనీసం అంబులెన్స్ కు కూడా ఫోన్ కాల్  చేయలేకపోయారని పోలీసులు చెప్పారు. నాలుగు కిలోమీటర్ల వరకు ట్రాలీలో లాక్కెళ్లిన అనంతరం ఆస్పత్రిలో చేర్పించగా అప్పటికే సుబ్రమణి మృతిచెందినట్టు వైద్యులు నిర్థారించారు. 

మృతదేహాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు తమ దగ్గర ఎలాంటి సౌకర్యాలు లేవని కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నారు. తమిళనాడుకు 25కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుచ్చేరి సరిహద్దు మీదుగా ఆస్పత్రి వాహనాలను తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. మరో దారి లేకపోవడంతో మృతుడి కుటుంబం అదే ట్రాలీ బండిపై తిరిగి తమ గ్రామానికి లాక్కొని తీసుకెళ్లారు. ఈ విషయం పోలీసు అధికారి దృష్టికి వెళ్లడంతో ఆయన ఎన్ జీఓ నడిపే అంబులెన్స్ ఏర్పాటు చేశారు.