Punjab: స్వర్ణ దేవాలయం ఇండియాలో లేదట, పంజాబ్‭లో ఉందట.. త్రివర్ణ పతాకం ఉందని లోపలికి అనుమతించలేదు

ఒక మహిళను స్వర్ణ దేవాలయంలోకి అనుమతించలేదు. కారణం ఆమె బుగ్గలపై త్రివర్ణ పతాకం రంగులు ఉన్నాయి. ఆమె లోపలికి వెళ్తుండగా ఇదే విషయాన్ని చెప్పి సిబ్బంది అడ్డుకున్నారు. అంతేనా.. ‘ఇది ఇండియా కాదు, పంజాబ్’ అంటూ వ్యాఖ్యానించడం మరింత తీవ్రతకు కారణమైంది.

Punjab: స్వర్ణ దేవాలయం ఇండియాలో లేదట, పంజాబ్‭లో ఉందట.. త్రివర్ణ పతాకం ఉందని లోపలికి అనుమతించలేదు

Golden temple

Punjab: ఖలిస్తానీ నినాదాలు, అమృతపాల్ సింగ్ లాంటి వారి వల్ల పంజాబ్ వాతావరణం ఇప్పటికే గందరగోళంగా ఉంది. అప్పుడెప్పుడో లేచి చల్లారిన ఉద్యమం మళ్లీ పైకి లేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమృత్‭సర్‭లో ఉన్న స్వర్ణ దేవాలయంలో (Golden Temple) జరిగిన సంఘటన తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఒక మహిళను స్వర్ణ దేవాలయంలోకి అనుమతించలేదు. కారణం ఆమె బుగ్గలపై త్రివర్ణ పతాకం రంగులు ఉన్నాయి. ఆమె లోపలికి వెళ్తుండగా ఇదే విషయాన్ని చెప్పి సిబ్బంది అడ్డుకున్నారు. అంతేనా.. ‘ఇది ఇండియా కాదు, పంజాబ్’ అంటూ వ్యాఖ్యానించడం మరింత తీవ్రతకు కారణమైంది.


దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఒక వ్యక్తి షేర్ చేస్తూ ‘ఇది పంజాబ్, ఇండియా కాదు’ అని సిబ్బంది చేసిన వ్యాఖ్యను ప్రస్తావిస్తూ ‘‘ఒక మహిళ ఆమె ముఖంపై భారత జెండాను పెయింట్ వేసుకుందని స్వర్ణ దేవాలయంలోకి రానివ్వలేదు’’ అని ట్వీట్ చేశారు. పంజాబ్ పోలీసుల్ని ట్యాగ్ చేస్తూ ఇదేంటని ప్రశ్నించాడు. కాగా, ఈ ఘటనపై నెటిజెన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరైతే అమృతపాల్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఖలిస్తానీ సానుభూతిపరులు పెరిగారంటూ కాస్త కఠినంగానే స్పందిస్తున్నారు.


అయితే ఈ విషయమై శిరోమణి గురుద్వారా పర్బందక్ కమిటీ జనరల్ సెక్రెటరీ గుర్చరణ్ సింగ్ గ్రేవాల్ స్పందిస్తూ ఇండియాకు వ్యతిరేకంగా సిబ్బంది స్పందించారనేదాన్ని తోసి పుచ్చారు. ‘‘సదరు యువతి వేసుకున్న జాతీయ జెండా మీద అశోక చక్రం లేదు. అలా లేకపోతే అది రాజకీయ జెండా అవుతుంది. అందుకే సిబ్బంది వ్యతిరేకించి ఉంటారు. ప్రతి మతానికి కొన్ని నిక్కచ్చి సంప్రదాయాలు ఉంటాయి. సిక్కు మతానికి కూడా ఉన్నాయి. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు, ఇక్కడికి అందరికీ ఆహ్వానం ఉంటుంది. ఏదేమైనప్పటికీ సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల క్షమాపణ చెబుతున్నాం’’ అని గుర్చరణ్ సింగ్ గ్రేవాల్ అన్నారు.