Jammu and Kashmir : ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. గడిచిన మూడు రోజుల్లో ఏడుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి

Jammu and Kashmir : ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

Jammu And Kashmir

Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. శుక్రవారం శ్రీనగర్ సమీపంలోని ఖ్రూ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం మేరకు గాలింపు చేపట్టిన స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు ఇద్దరు హిజ్బుల్ ముజాహిదిన్ ఉగ్రవాదులను హతమార్చారు.

ఇక శనివారం అవంతీపురలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిది జైషే మహ్మద్ గా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి పేలుడు పదార్దాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీస్, ఆర్మీ భద్రతాదళాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కాగా మూడు రోజుల వ్యవధిలో 3 సార్లు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందగా.. ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు.

ఇక ఇదిలా ఉంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దిల్‌బాగ్ సింగ్ ఉన్నతాధికారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితిని భంగపరిచేందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.

వారి దాడులను అడ్డుకునేందుకు భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉగ్రవాదులకు సాయం చేసేవారిపై నిఘా ఉంచాలని ఆయన నొక్కిచెప్పారు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్‌లో జరిగిన ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసు సంబంధిత అధికారుల సమావేశంలో ఆయన శాంతిభద్రతలను, భద్రతా చర్యలను పరిశీలించారు.

ఉగ్రవాద నిర్మూలించడానికి నిరోధక చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను డీజీపీ కోరారు. ఏ ప్రాంతంలోనైనా ఉగ్రవాదులు దాగి ఉన్నారనే అనుమానం ఉంటే, వెంటనే అక్కడ సెర్చ్ ఆపరేషన్ చెయ్యాలని వివరించారు. సెక్యూరిటీ ఏజెన్సీలు తమ తెలివితేటలను బలోపేతం చేసుకోవాలి, అవసరమైన అన్ని సమాచారాన్ని వెంటనే పంచుకునే విధంగా ఉండాలి. వేగంగా స్పందించాలని తెలిపారు.