ripped jeans : ఐయామ్ సారీ, వెనక్కి తగ్గిన సీఎం తీరత్ సింగ్

ripped jeans : ఐయామ్ సారీ, వెనక్కి తగ్గిన సీఎం తీరత్ సింగ్

Tirath Singh

Tirath Singh Rawat : యువతుల వస్త్రధారణ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. జీన్స్ ధరించడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ చిరిగిన జీన్స్ ధరించడం మాత్రం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజుల్లో పిల్లలు ఖరీదైన జీన్స్‌ను కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ప్యాంట్‌ను కత్తెరతో కట్ చేస్తున్నారని తీరత్ చెప్పారు. తాను ఇళ్లలో ఉండే వాతావరణం గురించి మాత్రమే మాట్లాడానని.. మంచి విలువలు, క్రమశిక్షణతో పెరిగిన చిన్నారులు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరని ఆయన చెప్పుకొచ్చారు.

తీరత్‌సింగ్‌ రావత్‌పై బీజేపీ అధిష్ఠానం సీరియస్‌గా స్పందించింది. మహిళలపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తీరత్‌ను ఢిల్లీకి పిలిచారు. మహిళలు, విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నడ్డా చర్యలకు ఉపక్రమించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. దీంతో తీరత్‌సింగ్‌ మహిళలకు క్షమాపణలు చెప్పారు.

సీఎం తీరత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి ఆశ్చర్యం వేసిందని, ఈ వేషధారణతో ప్రజలను కలవడానికి వెళితే..సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నట్లు అంటూ ఆయన ప్రశ్నించడం పట్ల మహిళలు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన్ను ప్రశ్నిస్తూ..కౌంటర్ ఇచ్చారు.

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా తీరథ్ సింగ్‌ రావత్‌ను బీజేపీ శాసన సభాపక్షం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా పని చేసిన త్రివేంద్ర సింగ్ రావత్.. తన పదవికి రాజీనామా చేశారు. సింగ్ ప్రస్తుతం ఎంపీగా పని చేస్తున్నారు. 2013-15 మధ్య ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్‌గా వ్యవహరించారు. గతంలో ఎమ్మెల్యేగానూ ఆయన పని చేశారు. ఉత్తరాఖండ్ తొలి విద్యాశాఖ మంత్రి తీరథ్ సింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2012లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. మరుసటి ఏడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు.