ఈ సబ్ కలెక్టర్ వరకట్నం ఏం తీసుకున్నాడో తెలుసా …

  • Published By: chvmurthy ,Published On : March 2, 2020 / 08:04 PM IST
ఈ సబ్ కలెక్టర్ వరకట్నం ఏం తీసుకున్నాడో తెలుసా …

కన్నతల్లి రుణం ..ఉన్నఊరు రుణం తీర్చుకోమని పెద్దలు చెపుతుంటారు. పుట్టిన గడ్డపై మమకారంతో ఆప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనుకున్నాడు ఓ జిల్లా సబ్ కలెక్టర్. అందులో భాగంగా తన పెళ్ళికి అడిగిన వరకట్నం కోరిక విని పలువురు వధువుల తల్లితండ్రులు పరుగు లంకించుకున్నారు. కానీ చెన్నైకి చెందిన గణిత అధ్యాపకుడు తన కుమార్తెను ఇచ్చి చేయటానికి ముందుకు వచ్చాడు. దీంతో వారి పెళ్లి ఫిబ్రవరి 26 న ఘనంగా జరిగింది. 

తంజావూరు జిల్లా, ఒట్టంగాడు గ్రామానికి చెందిన శివగురు ప్రభాకరన్ ఐఏఎస్‌ అధికారి స్థాయికి చేరుకోటానికి అనేక కష్టాలు పడ్డాడు. ప్రస్తుతం తిరునెల్వేలిలో సబ్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి పెళ్లి చేసేందుకు అతని తల్లిదండ్రులు తగిన వధువు కోసం అన్వేషణ మొదలెట్టారు.

సబ్ కలెక్టర్  హోదాలో ఉన్న శివగురును  పెళ్లి చేసుకునేందుకు పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌ చదివిన యువతులు సిద్ధపడినా తాను మాత్రం ఒక  డాక్టర్ నే పెళ్లి చేసుకుంటానని  అలాంటి సంబంధమే చూడాలని తెలిపాడు. తల్లిదండ్రులు మెడిసిన్ కోర్స్‌ చేసిన యువతి కోసం వెతకసాగారు.
 

ఈక్రమంలో మెడిసిన్‌ చేసిన యువతులు లభించినా,  శివగురు ప్రభాకరన్ కోరిన వింత వరకట్నం కోరిక విని పారిపోయారు. చెన్నై నందనం కళాశాలలో పనిచేసే గణిత అధ్యాపకురాలి కుమార్తె డాక్టర్‌ కృష్ణభారతిని చూశారు. డాక్టర్‌ కృష్ణభారతికి వరుని నూతన నిబంధనను సంశయంతో వెల్లడించారు సబ్‌ కలెక్టర్‌ తల్లిదండ్రులు.

తమ కుమారుడు పెళ్లాడే డాక్టర్‌ వారంలో రెండు రోజులు ఒట్టంగాడు గ్రామ ప్రజలకు, పరిసర ప్రాంతాల ప్రజలకు ఉచితంగా వైద్య సేవలందించాలన్న అతని వరకట్నం కోరికని వెల్లడించారు. దీన్ని కృష్ణభారతి సంతోషంగా స్వీకరించడంతో ఫిబ్రవరి 26న ఇద్దరికీ వివాహం జరిగింది. ఈ కాలంలోను ఇటువంటి వ్యక్తా అంటూ ఆ ప్రాంత ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ పట్ల ఉన్న ప్రేమానురాగాలతో పొంగిపోయిన పేరావూరణి ప్రజలు జంటను ప్రశంసించారు.