తిరుపతి-తిరుమల మోనో రైలు : ప్రతిపాదనలు సిధ్ధం చేస్తున్న హైదరాబాద్ మెట్రో

  • Published By: chvmurthy ,Published On : February 25, 2020 / 09:27 AM IST
తిరుపతి-తిరుమల మోనో రైలు : ప్రతిపాదనలు సిధ్ధం చేస్తున్న హైదరాబాద్ మెట్రో

తిరుమలకు లైట్‌ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డిని నివేదిక ఇవ్వాలని కోరినట్టు ఆయన చెప్పారు. నివేదిక వచ్చాక ఈ అంశంపై అవసరమైతే ఆగమపండితులతో చర్చిస్తామని తెలిపారు. తిరుమలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తిరుమలలో రోడ్డుపై వెళ్లే మోనో, ట్రామ్‌ రైలు తరహా వాటిని మాత్రమే పరిశీలిస్తున్నామని, తీగలతో నడిచే రైలు వంటివాటి జోలికి వెళ్లడంలేదన్నారు. 

తిరుమల లో పర్యావరణ పరిరక్షణకు రైలు ప్రతిపాదన ఉపయోగ పడుతుందని సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆస్ట్రియాలో ఎత్తయిన కొండపైకి మోనో రైలు వెళ్తున్నదని, దానిని మోడల్‌గా తీసుకొని తిరుమలకు రైలు ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వివరించారు. ఏడుకొండల్లో ఎటువంటి టన్నెల్ తవ్వకుండా ఉన్న మార్గాల్లోనే మోనో రైలు అవకాశాలను పరిశీలించాలని కోరినట్లు అయన తెలిపారు. తిరుమలలో రోడ్డుపై నడిచే  మోనో, ట్రామ్  రైలు వంటి తరహాలో నడిచే రవాణా సదుపాయాన్ని మాత్రమే పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. 

ప్రధానంగా మోనో రైలు  అవకాశాలను పరిశీలిస్తున్నామని…రోప్ వే లు, కేబుల్ కార్లు వద్దని చెప్పామన్నారు. రెండు నడక మార్గాలు, రెండు ఘాట్ రోడ్లలోనూ  మోనో రైలు వేయటానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం తిరుమల సందర్శనకు వెళ్లిన హైదారాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి …టీటీడీ  చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో  తిరుపతి నుంచి తిరుమల కు రైలు సదుపాయం,రేణిగుంట తిరుపతి మార్గం లో ట్రాఫిక్ నివారణ, తిరుపతి పట్టణ సుందరీకరణ గురించి ప్రస్తావించారు. దానికి కొనసాగింపుగా వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్ లో  ఎన్వీఎస్ రెడ్డితో సమావేశమై మరికొన్ని చర్చలు జరిపారు. 

తిరుమల కొండపైకి నిత్యం వేలాది వాహనాలు వచ్చివెళుతుంటాయి. దీంతో కొండపై వాయు కాలుష్యం, ట్రాఫిక్ పెరిగి పోయాయి. పార్కింగ్ సమస్య తలెత్తింది. వాహాన కాలుష్యం తగ్గించటానికి ప్రవేశపెట్టిన బ్యాటరీ వాహనాలు అనుకున్నంతగా ఫలప్రదం కాలేదు.  ఇక  తిరుపతి నుంచి తిరుమల కు రోప్ వే  నిర్మించాలనుకున్న ప్రాజెక్టుకూడా సఫలంకాలేదు. దీంతో ఇప్పుడు మోనో రైలు,లైట్ మెట్రో రైలు తరహాలో  రవాణా వ్యవస్ధకోసం  టీటీడీ అధికారులు కలరత్తు చేస్తున్నారు.