పశ్చిమ బెంగాల్ లో పొలిటికల్ హీట్, ఒకే చోట, ఒకే టైం.. రెండు యాత్రలు

పశ్చిమ బెంగాల్ లో పొలిటికల్ హీట్, ఒకే చోట, ఒకే టైం.. రెండు యాత్రలు

TMC Bike Rally And BJP Parivartan Yatra : పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ మరింత హీటెక్కుతోంది. ఇప్పటికే గత కొన్నేళ్లుగా ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆరోపణలు, దాడులు చేసుకుంటూ రాజకీయ వైరాన్ని మరింత లోతుకు తీసుకెళ్తున్నాయి. కొద్ది రోజులుగా టీఎంసీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్న కమలం పార్టీ.. అందులో భాగంగానే.. ఆ పార్టీకి చెందిన 20 మంది కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుంది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు ఉన్నారు.

తాజాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజల్లోకి మరింత వెళ్లేందుకు ఇరు పార్టీలు యాత్రా రాజకీయాన్ని మొదలు పెట్టాయి. శని, ఆదివారం రెండు రోజుల పాటు వేల మోటారు సైకిళ్లతో ర్యాలీని నిర్వహించేందుకు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంది తృణమూల్ కాంగ్రెస్. నదియా జిల్లాలో ఈ ర్యాలీ మొదలు కానుంది. ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అదే సమయంలో అదే ప్లేస్ నుంచి పరివర్తన్ యాత్రకు పిలుపునిచ్చారు. దీంతో ఒకే చోట రెండు యాత్రలు మొదలు కానుండటంతో పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి పెరిగింది.

సహజంగా బీజేపీ కార్యక్రమం అనగానే అధికార టీఎంసీ పార్టీ అడ్డుపుల్లలు వేసేది. అనుమతులు లేవని, సెక్యూరిటీ ప్రాబ్లమ్ అంటూ నో చెప్పేది. కోర్టు అనుమతితో వాళ్లు ర్యాలీలకు అనుమతులు తెచ్చుకున్నారు. కానీ ఈసారి అలాంటి కండీషన్స్ ఏమి పెట్టకుండా ర్యాలీకి మమత సర్కార్ అనుమతి ఇచ్చింది. రూట్ మ్యాప్ వివరాలు ఇవ్వాలని కోరుతూ నదియా జిల్లా పోలీసులు స్వయంగా బీజేపీ నేతలకు లేఖ రాశారు.

అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీతో అనవసరమైన గొడవ చేసి అవకాశం ఇవ్వడం ఎందుకు అనుకున్నారో లేక మరో ప్లాన్‌ ఉందో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఉప్పు నిప్పులా ఉన్నా ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు.. ఈ యాత్ర పేరుతో ఎలాంటి ఘర్షణకు దిగుతారో అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. మరి రెండు రోజుల పాటు సాగనున్న యాత్ర ఎలా జరుగుతుందో చూడాలి.