MLA Madan Mitra : కప్పు టీ ధర రూ.15లక్షలు..ఎగబడి మరీ తాగిన జనం

ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడంలో కొందరు రాజకీయ నేతలు ప్రత్యేక దారిని ఎంచుకుంటారు.

MLA Madan Mitra : కప్పు టీ ధర రూ.15లక్షలు..ఎగబడి మరీ తాగిన జనం

Tea

MLA Madan Mitra ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడంలో కొందరు రాజకీయ నేతలు ప్రత్యేక దారిని ఎంచుకుంటారు. అదే తరహాలో పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎమ్మెల్యే మదన్ మిత్ర..తనదైన స్టైల్ లో ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

బెంగాల్ లోని కమర్‌హతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మదన్ మిత్ర ఆదివారం(ఆగస్టు-1,2021) కోల్‌కతాలోని భువానిపూర్ ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం మమతాబెనర్జీ భవానీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న నేపథ్యంలో..ఆమెకు మద్దతుగా మదన్ మిత్ర ప్రచారం చేశారు. మమతా బెనర్జీ జిందాబాద్..భవానీపూర్ ఓటు మమతకే అంటూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోదీ,కేంద్రప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. తృణమూల్ కాంగ్రెస్సే కాదు, ఇతర విపక్షాలు కూడా బీజేపీ ప్రభుత్వం 2014లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలుచేస్తాయో అని ఎదురుచూస్తూనే ఉన్నట్లు తెలిపారు. ప్రతి పౌరుడి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోదీ అప్పట్లో మాట ఇచ్చారుని.. మరి ఏళ్లు గడుస్తున్న ఆ రోజు ఇంకా రాలేదని, ఇది ఎప్పుడు నెరవేరనుందోనని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అయితే ఈ సందర్భంగా ఛాయ్ వాలా అవతారమెత్తిన ఎమ్మెల్యే మదన్ మిత్ర..తన అభిమానులు, ప్రజలకు టీ ఇచ్చారు. కప్పు టీ ధర రూ.15 లక్షలు అని చెప్పినప్పటికీ… అందరూ ఎగబడి మరీ ఎమ్మెల్యే అందించిన టీ తీసుకుని ఆనందంగా తాగారు. ఎమ్మెల్యే మదన్ మిత్ర మాట్లాడుతూ…ఇది ఒక ప్రత్యేకమైన టీ. మోదీజీ రైల్వే స్టేషన్లలో చాయ్ వాలాగా ఉన్నప్పుడు చేసిన టీ రుచికి సరిపోతుందని నేను అనుకుంటున్నాను. దీన్ని ఉచితంగా అందిస్తున్నాను. కానీ మీరు ధర అడిగితే మాత్రం..ఒక కప్పు ధరను రూ.15 లక్షలుగా చెప్తాను.. ఎందుకంటే ఇది మోదీ వాగ్దానం చేసిన మొత్తం కూడా 15 లక్షలే కాబట్టి. ప్రజలు తాను ఇచ్చే కప్పు టీ తాగాలంటే ఆ డబ్బు చెల్లించాలి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దగ్గరగా ఉన్నవారు అని మదన్ మిత్ర తనదైన స్టైల్ లో సెటైర్ వేశారు. అయితే ఈ టీ సెటైర్ పై బీజేపీ కూడా స్పందించింది. ఈ టీ సెటైర్‌ని బీజేపీ నేత దిలీప్ ఘోష్… పాజిటివ్‌గా తీసుకున్నారు. ప్రజల్లో మీకు ఉన్న పాపులార్టీని బాగానే వాడేసుకుటున్నారని సరదాగా కాంప్లిమెంట్ ఇచ్చారు.

కాగా, తృణ‌మూల్ కాంగ్రెస్‌లో మ‌ద‌న్ మిత్ర కీల‌క నేత‌గా ఉన్నారు. గ‌తంలో ఆయ‌న ర‌వాణ‌శాఖ మంత్రిగా ప‌నిచేశారు. ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీకి అత్యంత ఆప్తుల్లో ఆయ‌న కూడా ఒక‌రు. గతంలో పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయంటూ.. ఎడ్లబండిపై మదన్ మిత్ర వినూత్న ప్రచారం చేశారు.