బెంగాల్ గవర్నర్ ని తొలగించండి…రాష్ట్రపతికి టీఎంసీ ఎంపీల విజ్ణప్తి

బెంగాల్ గవర్నర్ ని తొలగించండి…రాష్ట్రపతికి టీఎంసీ ఎంపీల విజ్ణప్తి

west bengal governor:వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగదీప్‌ ధన్ కర్‌..రాజ్యాంగ పరిరక్షణలో గవర్నర్‌ వైఫల్యం చెందారని, తక్షణమే ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ ఐదుగరు తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC) పార్టీ ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాము సంతకాలు చేసిన మెమొరాండంను బుధవారం(డిసెంబర్-30,2020) రాష్ట్రపతి భవన్‌కు పంపించారు.

గవర్నర్‌ జగదీప్‌ ధన్ కర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. రాజ్యాంగాన్ని కాపాడటంలో గవర్నర్‌ వైఫల్యం చెందారని.. న్యాయ వ్యవస్థ ఆమోదించిన చట్టాలను పదే పదే ఉల్లంఘిస్తున్నారని రాష్ట్రపతికి పంపిన మెమొరాండంలో ఐదుగురు టీఎంసీ ఎంపీలు బందోపాధ్యాయ్‌, డెరెక్‌ ఒ బ్రెయిన్‌, కళ్యాణ్‌ బెనర్జీ, కకోలి ఘోష్‌ దస్తీదార్‌,సుఖేందు శేఖర్‌ ఆరోపించారు.

కాగా,కొన్ని నెలలుగా బెంగాల్‌ గవర్నర్‌-సీఎం మమతా బెనర్జీ మధ్య విమర్శల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి ఘటన విషయంలో ప్రభుత్వాన్ని, పోలీసుల తీరును తప్పుబడుతూ గవర్నర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఔట్‌ సైడర్స్‌ అంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి మమత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన.. పద్ధతిగా మాట్లాడాలంటూ హితవు పలికారు. అదే విధంగా పోలీసులు తీరును విమర్శిస్తూ.. ఈ ఘటనకు సంబంధించి కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఇక అప్పటి నుంచి ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య మరింతగా అగాధం పెరిగింది.

మరోవైపు, మరో నాలుగు నెలల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సీనియర్‌ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడటం, అదే సమయంలో వారిని పార్టీలో చేర్చుకుని బీజేపీ బలపడటం వంటి పరిణామాలతో అధికార టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలే కాషాయ కండువా కప్పుకొన్న మాజీ మంత్రి సువేందు అధికారి గతవారం గవర్నర్‌ తో భేటీ అయ్యారు.

రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా తనపై అక్రమ కేసులు బనాయించేందుకు మమత సర్కారు ప్రయత్నిస్తోందని,ఇందులో జోక్యం చేసుకోవాలంటూ సువెందు అధికారి గవర్నర్ కి విజ్ఞప్తి చేశారు. తాను టీఎంసీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, అందుకే ప్రతీకారంగా ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని కంప్లెయింట్ చేశారు. ఇందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంపై ఘాటుగా స్పందించిన తృణమూల్‌ ఎంపీ సుఖేందు శేఖర్‌ గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.