ఉనికికే ప్రమాదం : పౌరసత్వం బిల్లుపై విపక్షాలు ఆగ్రహం

  • Edited By: veegamteam , January 8, 2019 / 10:57 AM IST
ఉనికికే ప్రమాదం : పౌరసత్వం బిల్లుపై విపక్షాలు ఆగ్రహం

ఢిల్లీ: లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు వాడీవేడి చర్చకు దారితీసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. విపక్షాలు ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పార్టీల ఎంపీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పౌరసత్వ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. అక్రమ వలసదారులతో స్వదేశీ సంస్కృతికి ముప్పు పొంచి ఉందన్నారు. పౌరసత్వ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాలు తగలబడతాయ్ అని హెచ్చరించారు.

పౌరసత్వ బిల్లులో ఆరు మతాల (హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లు) వారిని మాత్రమే ప్రస్తావించారని, ముస్లింలకు స్థానం కల్పించలేదని టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ మండిపడ్డారు. మతాలతో సంబంధం లేకుండా చట్టాన్ని సెక్యులర్‌గా రూపొందించాలని డిమాండ్ చేశారు. తమ దేశాల్లో వేధింపులకు గురై భారత్‌కు శరణు కోరి వచ్చిన వారందరికీ బిల్లును వర్తింపజేయాలని సౌగత్ రాయ్ డిమాండ్ చేశారు.

బీజేపీ మిత్రపక్షం అసోం గణపరిషత్ కూడా పౌరసత్వం బిల్లుపై తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఏకంగా బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. పౌరసత్వం బిల్లుతో అసోం ప్రజల ఉనికి ప్రమాదం వాటిల్లుతుందని చెప్పినా బీజేపీ పట్టించుకోలేదని వాపోయింది. తమకు అస్సామీ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పింది. బీజేపీ ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

విపక్షాల ఆరోపణలను రాజ్‌నాథ్ ఖండించారు. NRCకి కట్టుబడి ఉన్నామని, దానిపై ఎలాంటి వివక్ష లేదని చెప్పారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, దాంతో పాటు దేశంలో చాలా ఏళ్లుగా నివసిస్తున్న వలసదారులకు పౌరసత్వం కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇది అసోంకి మాత్రమే సంబంధించినది కాదన్నారు. పశ్చిమ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వలసదారులు భారత్‌కు వచ్చారని.. రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో వాళ్లు స్థిరపడ్డారని చెప్పారు. చట్టబద్ధంగా ఉంటున్న వారికి పౌరసత్వం కల్పిస్తూనే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు.

పౌరసత్వ చట్టం-1955కి సవరణలు చేస్తూ కేంద్రం ఈ బిల్లుని లోక్‌సభలో పెట్టింది. ఆరేడేళ్లుగా దేశంలో నివసిస్తున్న విదేశీ వలసదారులకు భారత పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో పౌరసత్వం సవరణ బిల్లు-2016ని తీసుకొచ్చింది.