హిందీ రాకపోతే..ఇండియన్ కాదా..కనిమొళి ట్వీట్ తో కలకలం

  • Published By: madhu ,Published On : August 10, 2020 / 10:13 AM IST
హిందీ రాకపోతే..ఇండియన్ కాదా..కనిమొళి ట్వీట్ తో కలకలం

తమిళనాడు డీఎంకే నాయకురాలు, లోక్ సభ ఎంపీ కనిమొళి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన కనిమొళిని భద్రతా చర్యలో భాగంగా.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కు (సీఐఎస్ఎఫ్‌) చెందిన ఒక మహిళా అధికారి తనిఖీ చేశారు.



ఈ సందర్భంగా అధికారి హిందీలో మాట్లాడడం అర్థం కాలేదు కనిమొళికి. తమిళంలో గానీ, ఇంగ్లీషులో మాట్లాడాలని సూచించారు. మీరు ఇండియన్ కదా అని ప్రశ్నించిందని, ఈ ప్రశ్న విని తనకు ఆశ్చర్యం కలిగిందని కనిమొళి ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేశారు. CISF అధికారి తనతో మాట్లాడిందని, కానీ తాను ఇంగ్లీషు, తమిళంలో మాట్లాడమని కోరాను.


వెంటనే ఆమె మీరు భారతీయులు కారా? అని ప్రశ్నించింది. నేను ఒక విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నా. హిందీ తెలిసి ఉంటేనే ఇండియనా? హిందీ అనేది ఇండియన్‌కు సమానార్థమా?’ అని కనిమొళి వెల్లడించారు. ‘హిందీ ఇంపొజిషన్’ అంటూ తన ట్వీట్‌కు హ్యాష్ ట్యాగ్ కూడా జతచేశారు. కాగా, ఆమె పోస్టుకు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.



దీనిపై CISF స్పందించింది. ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపింది. వెంటనే రెస్పాండ్ అయ్యినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు కనిమొళి ట్వీట్ చేశారు.





విద్యా వ్యవస్థలో త్రి భాషా విధానం అమలు చేయాలన్న కేంద్ర యోచనపై దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో నూతన జాతీయ విద్యా విధానం 2019 ముసాయిదను సవరించింది. హిందీ తప్పనిసరి అనే నిబంధనను ముసాయిదా నుంచి తొలగించారు.