Bakrid 2021: నేడు బక్రీద్ పర్వదినం.. ఈదుల్ జుహాకు అంతా సిద్ధం!

Bakrid 2021: నేడు బక్రీద్ పర్వదినం.. ఈదుల్ జుహాకు అంతా సిద్ధం!

Bakrid 2021

Bakrid 2021: నేడు బక్రీద్ పర్వదినం.. హజ్రత్‌ ఇబ్రాహీమ్, హజ్రత్‌ ఇస్మాయీల్‌ అలైహిముస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం ఇదే. ముస్లింలు అతి పవిత్రంగా భావించే.. జిల్ హజ్ మాసంలో పదవ తేదీన జరుపుకొనే అపూర్వమైన పండగ ఇదే. బక్రీద్ అంటే ఓ సందేశం కలిగిన శుభదినం. త్యాగానికి ప్రతీకగా ముస్లింలు అతి పవిత్రంగా భావించే బక్రీద్ పండుగను ఎంతో వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు.

త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను ఈదుల్ జుహా అని కూడా అంటారు. నేటి ఈదుల్ జుహా వేడుకకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈద్గాలు, మసీదులు సుందరంగా అలంకరించారు. బక్రీద్ రోజున ప్రార్ధనల ద్వారా జంతువులను బలి ఇవ్వడం ఆచారంగా వస్తోంది. మనిషి తనను తాను తగ్గించుకొని, వినమ్ర పూర్వకంగా అల్లాహ్‌ ఔన్నత్యాన్ని, ఆయన ఘనతను కీర్తించే గొప్పరోజు ఇదే.

మనందరి ధర్మం ఒక్కటే.. మనమంతా ఒక్కటే.. సమస్త మానవజాతీ ఒక్కటే.. అని ఎలుగెత్తి చాటే రోజు కూడా ఇదే. మానవ సహజ దౌర్బల్యాల వల్ల చిన్నా చితకా పాక్షిక విభేదాలు ఉన్నప్పటికీ అందరి విశ్వాసం ఒక్కటే అనడానికి ప్రబల తార్కాణంగా ఈ పండుగ జరుపుకుంటారు. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పొరపొచ్చాలను విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాల్సిన రోజుగా ఈదుల్ జుహాను జరుపుకోవాల్సి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటుండగా.. ముస్లిం సంస్థ ఉలేమా-ఈ-హింద్ ప్రకారం జులై 11న జుల్ హిజ్జాకు నెలవంక కనిపించింది. దీని ప్రకారం భారత్‌లో జులై 21 బుధవారం నాడు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పర్వదినాన్ని మూడు రోజుల పాటు జరుపుకుంటుండగా బక్రీద్ రోజున ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో ఈరోజున భారీగా జంతుబలి జరగనుంది.