దూరంగా ఉండమన్నారు : బీజేపీ తీరుపై బాధపడ్డ MM జోషి

  • Published By: venkaiahnaidu ,Published On : March 26, 2019 / 09:32 AM IST
దూరంగా ఉండమన్నారు : బీజేపీ తీరుపై బాధపడ్డ MM జోషి

ఎన్నికల్లో తనను దూరంగా ఉండాలని బీజేపీ తనను కోరిందని ఆ పార్టీ కురువృద్ధుడు,బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్ జోషి(85) సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓటర్లను ఉద్దేశిస్తూ ఆయన ఓ లేఖను రాశారు.ఆ లేఖలో….ప్రియమైన కాన్పూర్ ఓటర్లకు…రానున్న ఎన్నికల్లో కాన్పూర్ నుంచే కాకుండా మరెక్కడి నుంచి కూడా పోటీ చేయవద్దని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ లాల్ ఈ రోజు నన్ను కోరారు అని ఆ లేఖలో ఉంది.ఆ లేఖపై మురళీ మనోహర్ జోషి సంతకం లేకపోయినప్పటికీ ఈ లేఖ ఆయన రాసినదేనని మరళీ మనోహర్ జోషి స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు ఓ ఇంగ్లీష్ మీడియా తెలిపింది.

ఇప్పటికే బీజేపీ కురువృద్దుడు ఎల్ కే అద్వాణీకి గాంధీనగర్ సీటు విషయంలో పార్టీ తన పట్ల వ్యవహరించిన తీరుపై  అసంతృప్తి వ్యక్తం చేయగా ఇప్పుడు ఆ జాబితాలో మురళీ మనోహర్ జోషి కూడా చేరారు. తన పట్ల పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు మురళీ మనోహర్‌ జోషి కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఒకవేళ తన పోటీ విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అది స్వయంగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తనకు తెలియజేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడినట్లు సన్నిహితులు తెలిపారు.

బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మురళీ మనోహర్‌ పార్టీ జాతీయాధ్యక్షుడిగా,కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ప్రధాని మోడీ కోసం వారణాసి నుంచి తప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో కాన్పూర్‌ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు.అయితే మోడీ ప్రధాని అయిన తర్వాత ఐదుగురు సభ్యులతో కూడిన ఓ మార్గదర్శక మండలిని ఏర్పాటు చేసి అందులో మరళీ మనోహర్ జోషి,అద్వాణీ,దివంగత ప్రధాని వాజ్ జేయి వంటి సీనియర్లను ఆ కమిటీలో వేశారు.అయితే గడిచిన ఐదేళ్లలో ఈ కమిటీ ఒక్కసారి కూడా సమావేశమవలేదు. దశాబ్దాల రాజకీయ జీవితంలో అద్వాణీ,మరుళీమనోహర్ జోషిలు ఇప్పుడు లోక్ సభను విడిచిపెట్టాల్సివచ్చింది.