మరింత టోల్ భారం: ఆ హైవేపై ‌ఛార్జీల మోత

  • Published By: veegamteam ,Published On : April 1, 2019 / 06:18 AM IST
మరింత టోల్ భారం: ఆ హైవేపై ‌ఛార్జీల మోత

విజయవాడ : హైదరాబాద్-విజయవాడ హైవేపై ‌టోల్ ఛార్జీలతో వాహనదారులు అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై రోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రెండు రాష్ట్రాలకు మార్గమైన ఎన్‌హెచ్-65పై నిత్యం లక్షలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. దీంతో ప్రభుత్వానికి టోల్ ఛార్జీల ద్వారా కోట్లలో ఆదాయం సమకూరుతుంటుంది. ఈ  హైవేని నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థ తాజాగా టోల్ ఛార్జీలు పెంచి వాహనదారులపై మరింత భారాన్ని మోపింది. 
 

బోవోటీ (బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో భాగంగా ఈ హైవేని ఫోర్  లైన్స్ గా మార్చిన జీఎంఆర్‌కు టోల్ వసూలు చేసుకునేందుకు ఎన్‌హెచ్ఏఐ పర్మిషన్  ఇచ్చింది. దీంతో జీఎంఆర్ సంస్థ తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి వద్ద, నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద టోల్ ప్లాజాలు ఏర్పాటుచేసింది. నిబంధనల ప్రకారం ఏడాదికొకసారి టోల్ ధరలు పెంచుకునే వీలుండగా..తాజాగా పెంచిన ధరల ప్రకారం వాహన సామర్థ్యాన్ని బట్టి రూ.5ల నుంచి రూ.860 వరకు ప్రయాణికులపై భారం పడనుంది. ఏది ఏమైనా పలు పనులతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వాహనదారులకు ఈ భారం తప్పనిసరికానుంది.