Toor Dal : కంది పూత,కాత దశలో సస్యరక్షణ..

కంది పూత, కాత దశల చాలా ముఖ్యమైనది. ఆదశలో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే కంది పంటను పురుగులు మరియు తెగుళ్ల నుండి కాపాడి అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది.

Toor Dal : కంది పూత,కాత దశలో సస్యరక్షణ..

Toor Dal

Toor Dal : తెలుగు రాష్ట్రాల్లో కంది పంటను ప్రధాన పంటగా , పెసర ,మినుము ,వేరు శనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా ఖరీఫ్ లో సాగు చేస్తున్నారు. కంది పంట పూత మరియు కాయ ఏర్పడే దశలో వివిధ రకాల చీడ పురుగులు మరియు తెగుళ్ళు ఆశించి అధిక నష్టాన్ని కలుగజేస్తున్నాయి. పూత,కాత దశలో సరైన సస్య రక్షణ చర్యలు చేపడితే కంది పంటలో అధిక దిగుబడిని సాధించవచ్చును. కందిని ఆశించి నష్ట పరిచే పురుగుల్లో ఆకు చుట్టూ పురుగు , మారుక మచ్చల పురుగు, కాయ తొలుచు పురుగు, కాయ ఈగ ముఖ్యమైనవి.

చీడపీడలు సస్యరక్షణ..

మారుకా మచ్చల పురుగు : తెల్ల రెక్కల పురుగు లేత ఆకులపై, పూమొగ్గలపై, పిందెలని, కాయలను తొలిచి తింటాయి. కంది పంట పూత దశలో ఆకాశం మేఘా వృత్తమై మరియు అడపాదడపా చిరు జల్లులు కురిసినప్పుడు ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తొలి దశలో ఈ పురుగు నివారణకు వేప నూనె 5 మి.లీ లీటరు నీటికి కలిపి మొగ్గ దశలో పిచికారి చేయాలి. ఈ పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ మరియు డైక్లోరోనాస్ 1 మి.లీ లేదా నోవ్వాలురాన్ 0.75 మీ.లీ మరియు డైక్లోరోవాస్ 1 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోసాడ్ 0.3 మీ.లీ లేదా ఇమా మేక్టిన్ 0.4 గ్రా లేదా క్లోరధ్రానిల్ప్రోల్ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాయ తొలిచే పురుగు : ఈ పురుగు దీర్ఘ కాలిక రకాలలో ఎక్కువగా ఆశిస్తుంది. తల్లి పురుగు గ్రుడ్లను అభివృద్ది చెందుతున్న పిందెలలో చొప్పిస్తుంది. గ్రుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు అభివృద్ది చెందుతున్న గింజలను తినడం వలన పురుగు తిన్న గింజ పనికి రాదు. పూత మరియు పిందె దశలలో బెట్ట వాతావరణ పరిస్థితులు నెలకొన్నపుడు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగు నివారణకు తొలి దశలో 5 % వేప నూనె పిచికారి చేయాలి. మోనోక్రోటోపాస్ 1.6 మీ.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

శనగ పచ్చ పురుగు : తల్లి పురుగు లేత చిగుళ్ళ పై, పూ మొగ్గలపై ,లేత పిందెల పై విడి విడిగా గ్రుడ్లను పెడుతుంది. గ్రుడ్ల నుండి వచ్చిన లార్వాలు తొలి దశలో మొగ్గల్ని గోకి తిని తరువాతి దశలో మొగ్గల్ని తొలచి కాయలోనికి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయట ఉంచి లోపల గింజలను తినివేస్తుంది. అందువలన కాయల పై గుండ్రని రంధ్రాలు కనిపిస్తాయి. ఈ పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్దతులు పాటించాలి.

బాగా ఎదిగిన పురుగులను గమనించిన వెంటనే వాటిని ఏరి వేయాలి. ఎకరానికి 4 అంగాకర్షక బుట్టలను అమర్చి పురుగు ఉధృతిని గమనిస్తూ ఉండాలి. పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి ఎకరానికి 20 పక్షి స్థావరాలు ఏర్పాటుచేసుకోవాలి. పురుగు గ్రుడ్లను తొలి దశలో గమనించిన వెంటనే5% వేపగింజల కాషాయం లేదా వేప నూనె పిచికారి చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇండాక్సా కార్బ్ 1 మీ.లీ లేదా స్పైనోసాడ్ 3 మీ.లీ లేదా క్లోరోధ్రనిలప్రోల్ 0.3 మీ.లీ లేదా ప్లూబెండమైండ్ 0.2 మీ.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆకుమచ్చ పురుగు : కంది పంట పెరిగే దశలో ఆకు చుట్టు పురుగు ఆశించి నష్ట పరుస్తుంది. లద్దె పురుగు ఆకులను ,పూతను చుట్టుగా చుట్టుకొని లోపల ఉండి ఆకులను తింటాయి. ఒక్కోసారి పువ్వులను లేత కాయలను తొలిచి తింటాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మోనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ లేదా క్వినోల్ పాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పూత పెంకు పురుగు : ఎర్రని లేదా నారింజ రంగు మచ్చలు , గీతలున్న నల్లని పూత పెంకు పురుగులు కందిని పూత దశలో ఆశించి,మొగ్గలను తినడం వలన కాత శాతం తగ్గిపోతుంది. ఈ పురుగులు గమనించిన వెంటనే ఉదయం పూట పురుగులను ఏరి వేసి నాశనం చేయాలి. కందిని చీడపురుగులే కాకుండా కొన్ని రకాల తెగుళ్ళు కూడా ఆశించి తీవ్ర నష్టాన్ని కలుపుజేస్తున్నాయి.

రసం పేల్చే పురుగులు : రసం పీల్చే పురుగులైనటువంటి పచ్చ దోమ మరియు పేనుబంక ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. ఇవి అప్పుడే ఏర్పడుతున్న కాయలను ఆశించడం వలన గింజ సరిగ్గా ఏర్పడదు. అంతే కాకుండా కాయలు నల్లగా మారుతాయి. తేమలో కూడిన చల్లని వాతావరణంలో వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కావున వీటి నివారణకు డైమిధో మెట్ 2 మీ.లీ లేదా మోనోక్రోటోపాస్ 1.6 మీ.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

గొడ్డు మోతు తెగులు : తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగు గల చిన్న ఆకులను వీపరీతంగా తొడుగుతుంది మరియు పూత పూయదు. ఈ తెగులు నల్లులు ద్వారా వ్యాపిస్తుంది. బెట్ట వాతావరణ పరిస్థితులలో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కావున ఈ పురుగు నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రా లీటరు నీటికి లేదా డైకోపాల్ 5 మీ.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఎండు తెగులు : కంది పంటలో ఈ తెగులు ప్రదానమైన సమస్య తెగులు సోకిన మొక్కలను చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. ఈ తెగులు భూమిలో ఉండే శిలీంద్రం వలన వ్యాప్తి చెందుతుంది. కావున తట్టుకునే రకాలను సాగుచేసుకోవాలి. ట్రెకోడర్మ విరిడిని పంటలో వేసుకోవాలి.

కంది పూత, కాత దశల చాలా ముఖ్యమైనది. ఆదశలో తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లైతే కంది పంటను పురుగులు మరియు తెగుళ్ల నుండి కాపాడి అధిక దిగుబడి సాధించేందుకు అవకాశం ఉంటుంది.