న్యూ ఇయర్ లో టాప్‌ 10 గుడ్‌ న్యూస్..కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌

న్యూ ఇయర్ లో టాప్‌ 10 గుడ్‌ న్యూస్..కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌

Top 10 Good News Ready for the New Year : కొత్త ఏడాది ఎన్నో కొత్త ఆశలను తీసుకురాబోతోంది. గత ఏడాదిలో భయపెట్టిన కరోనాకు ఈ ఏడాదిలో వ్యాక్సిన్‌ రాబోతుంది. జనవరి 1 నుంచి మన జీవితంలో రాబోతున్న పది మంచి విషయాలు ఓ సారి చుద్దాం..

1. నూతన సంవత్సరంలో కరోనా వ్యాక్సినేషన్‌పై ఏ నిమిషమైనా గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే వ్యాక్సిన్‌ అనుమతి కోసం ఆస్ట్రాజెనెకా, సీరమ్‌ ఇన్సిస్టిట్యూట్‌ల కోవీషీల్డ్‌, ఫైజర్‌, భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌లు డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. టీకా అత్యవసర వినియోగంపై కమిటీ భేటీ అవుతోంది. సమావేశంలో టీకాకు డీసీజీఐ అత్యవసర అనుమతి ఇస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

2. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తామంటూ తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు 33 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేందుకు సర్కారు సుముఖంగా ఉంది. ఇప్పటికే పీఆర్సీపై నియమించిన బిశ్వాల్‌ కమిటీ నివేదిక సమర్పించింది. ప్రభుత్వ నిర్ణయంతో …. మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. మరోవైపు ఆర్టీసీ, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్ సిబ్బందికి వేతనాల పెంపుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. మొత్తంగా 9 లక్షల మందికి పైగా వేతనాలు పెరగనున్నాయి.

3. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. గతేడాది తరహాలోనే ఈ సారి కూడా ఒకే పేపర్‌తో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. పదో తరగతిలో హిందీని మినహాయిస్తే మిగిలిన సబ్జెక్టులకు రెండు పేపర్లలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అయితే కరోనా నేపథ్యంలో తరగతులు నిలిచిపోవడం… సోషల్‌ డిస్టెన్సింగ్‌ వంటి నిబంధనల కారణంగా గతేడాది రెండు పేపర్ల స్థానంలో ఒకే పేపర్‌గా పరీక్షలు నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయం వల్ల దాదాపు 3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులకు మేలు జరుగుతుంది.

4. ఏపీలో మందుబాబులకు పాపులర్‌ బీర్‌ బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. ఏపీలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నారు. అందులో భాగంగా పాపులర్‌ బ్రాండ్లకు చెందిన బీర్లు, ఆల్కహాల్‌ అమ్మకాలను నిషేధించారు. దీంతో ఊరుపేరు లేని బ్రాండ్లకు చెందిన బీర్లే ఏపీలో లభ్యమవుతున్నాయి. బ్రాండెండ్ బీర్లు కావాలంటే సరిహద్దులు దాటుతున్నారు ఏపీ మందు బాబులు. ఇప్పుడు ప్రభుత్వం రెండు పాపులర్‌ బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంతో ఏపీలో ఉన్న లక్షలాది మంది మందుబాబులు ఖుషీగా ఫీలవుతున్నారు.

5. ఆరు కోట్ల మంది ఈపీఎఫ్‌ ఖాతాదారులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చింది ఈపీఎఫ్‌వో. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధఙంచి 8.5 శాతం వడ్డీని ఈ పీఎఫ్‌ ఖాతాలో జమ చేసింది. ఈ ఏడాది మార్చిలో వడ్డీ రేటును సవరించింద ఈపీఎఫ్‌వో. అయితే ఆ వెంటనే కరోనా కారణంగా లాక్‌డౌన్‌ రావడంతో వడ్డీ ని రెండు గా విభజించి ఒకసారి 8.16 శాతం, మరోసారి 0.35 శాతం వడ్డీ ని ఖాతాలో జమ చేస్తామని కేంద్రం చెప్పింది. కానీ చివరకు ఒకే విడతలో 8.5 శాతం వడ్డీని లబ్ధిదారుల ఖాతాలో జమ చేసింది.

6. రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టిక్కెట్ల బుకింగుతో పాటు భోజనం, రిటైరింగ్‌ రూమ్స్‌, హోటల్స్‌ బుక్‌ చేసుకునే అవకాశం కొత్త సంవత్సరం నుంచి కల్పిస్తున్నట్టు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. దీంతో పాటు స్టేషన్‌లోకి ఎంటర్‌ కాగానే ఎక్కాల్సిన రైలు ఏ ప్లాట్‌ఫారమ్ మీదకు వస్తుందో కూడా నోటిఫికేషన్‌ ఇచ్చే సౌలభ్యం అందుబాటులోకి తెచ్చింది. ఇక రెగ్యులర్‌, ఫేవరేట్‌ జర్నీ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా త్వరగా టిక్కెట్లు బుక్‌ చేసుకునే అవకాశం ప్రయాణికులకు లభిస్తుంది. ఈ మార్పుల వల్ల 6 కోట్ల మంది ఐఆర్‌సీటీసీ ఖాతాదారులకు లబ్ధి కలుగుతుంది.

7. చిన్నా వ్యాపారులకు ఊరటనిచ్చేవిధంగా జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకున్నది. జనవరి ఒకటో తేదీ నుంచి చిరు వ్యాపారులు నెలనెలా రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఐదు కోట్లలోపు టర్నవర్‌ కలిగిన వ్యాపారులు ఇకపై మూడు నెలలకు ఓసారి రిటర్నులు దాఖలు చేస్తే సరిపోతుంది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోని దాదాపు 94లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరుతుంది.

8. చెక్కుల ద్వారా జరిపే చెల్లింపుల్లో మోసాలను అరికట్టేందుకు రిజర్వు బ్యాంక్‌ జనవరి 1 నుంచి ‘పాజిటివ్‌ పే’ అనే నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది. దీంతో చెక్కుల ద్వారా మరింత సురక్షితంగా లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలవుతుంది. చెక్కు వివరాలను మార్చే మోసాలను నిలువరించేందుకే ‘పాజిటివ్‌ పే’ విధానాన్ని తీసుకొచ్చింది ఆర్బీఐ. 5 లక్షల రూపాయలు, ఆపై మొత్తాలకు జారీచేసిన చెక్కులను బ్యాంకులు పునఃసమీక్షించనున్నారు.

9. 2021 ఐపీఎల్‌ సీజన్‌లో ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని బీసీసీఐ క్రికెట్ లవర్స్‌ కి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనా కారణంగా సోషల్ డిస్టెన్సింగ్‌ పాటించడం వీలు కాకపోవడంతో 2020 సీజన్‌కి ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్‌ణి నిర్వహించింది బీసీసీఐ. అయితే ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుండటం, దేశంలో రికవరీ రేటు పెరగడంతో బీససీఐ తన పంథాను మార్చుకుంది. స్టేడియంలో 50 శాతం కెపాసిటీతో ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.

10. రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ పాపులర్‌ ఆఫర్‌ను మరోసారి ఖాతాదారులకు అందుబాటులోకి తెచ్చింది. జియో నుంచి ఏ నెట్‌వర్క్‌ కైనా అన్‌లిమిటెడ్‌ ఫ్రీ కాల్స్‌ ఆఫర్‌ను పునరుద్ధరించింది. జియో నెట్‌ వర్క్‌ ప్రారంభమైన కొత్తలో ఈ ఆఫర్‌ ప్రజలకు విపరీతంగా ఆకర్షించింది. అయితే దీనిపై ఇతర నెట్‌వర్క్‌లు అభ్యంతరం చెప్పడంతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఫ్రీ కాల్స్‌ ఆఫర్‌పై ఆంక్షలు విధించింది. డిసెంబరు 31తో ఆ ఆంక్షలు తొలగిపోవడంతో… మరోసారి 2021 జనవరి 1 నుంచి జియో ఆఫర్‌ అందుబాటులోకి వచ్చింది.