Union Health Ministry : అవన్నీ అసత్యాలే…కోవిడ్ మరణాల లెక్కపై కేంద్రం

  దేశంలో అధికారిక లెక్కలతో పోలిస్తే కరోనా మరణాల వాస్తవ సంఖ్య అధికంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

Union Health Ministry : అవన్నీ అసత్యాలే…కోవిడ్ మరణాల లెక్కపై కేంద్రం

Covid (3)

Union Health Ministry  దేశంలో అధికారిక లెక్కలతో పోలిస్తే కరోనా మరణాల వాస్తవ సంఖ్య అధికంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారత్ లో కరోనా మృతుల సంఖ్య.. ప్రభుత్వ లెక్కలతో పోలిస్తే 49 లక్షల మేర అధికంగా ఉండొచ్చని మంగళవారం అమెరికాకి చెందిన రీసెర్చ్ గ్రూప్- సెంటర్​ ఫర్​ గ్లోబల్​ డెవలప్​మెంట్ విడుదల చేసిన రిపోర్ట్ ని కేంద్రం తప్పుబట్టింది. మరణాల సంఖ్యను తక్కువగా నమోదు చేశారన్న ఆరోపణలను కొట్టిపారేసింది. అదనపు మరణాలన్నింటినీ కొవిడ్ మరణాలుగా నివేదికలు పరిగణిస్తున్నాయని, ఇది సరైంది కాదని వ్యాఖ్యానించింది.

కరోనా కేసులు దృష్టికి రాకపోయినా, మరణాలు మాత్రం నమోదు కాకుండా ఉండే అవకాశం తక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వైరస్​తో చనిపోయే అవకాశం దేశవ్యాప్తంగా ఒకేరకంగా ఉంటుందనే విషయం ఆధారంగా మరణాల గణన చేపట్టారు. ప్రత్యక్ష, పరోక్ష కారకాలను విస్మరించారు. జనాభాలోని వివిధ వర్గాలను, వారి జీనోమ్ ఆకృతులను పరిగణనలోకి తీసుకోలేదు. యాంటీబాడీలు త్వరగా నాశనమవుతాయని, తద్వారా మరణాల రేటు పెరుగుతుందని ఈ అధ్యయనం భావించడం కూడా ఆందోళనకరం. అధికంగా నమోదైన మరణాలన్నింటినీ కోవిడ్ మరణాలుగా ఈ అధ్యయనం పరిగణిస్తోంది. ఇది పూర్తిగా తప్పుదోవపట్టించే విధంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది.

READ   India’s Covid-19 Deaths : భారత్ లో కరోనా మరణాలు..ప్రభుత్వ లెక్కల కంటే పది రెట్లు అధికం

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ సైతం రాజ్యసభలో కరోనా మరణాలను దాస్తున్నారనే ఆరోపణలను ఖండించారని ఆరోగ్య శాఖ తన ప్రకటనలో గుర్తు చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పంపించే డేటాను మాత్రమే తాము ప్రచురిస్తామని తెలిపింది. మార్గదర్శకాలను అనుసరించి సరిగ్గా మరణాలను నమోదు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అనేకసార్లు సూచించినట్లు స్పష్టం చేసింది.