ఘజియాబాద్-ఢిల్లీ బోర్డర్ లో భారీ ట్రాఫిక్ జామ్

  • Published By: venkaiahnaidu ,Published On : April 21, 2020 / 12:45 PM IST
ఘజియాబాద్-ఢిల్లీ బోర్డర్ లో భారీ ట్రాఫిక్ జామ్

ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్, ఢిల్లీలను కలిపే ప్రధాన రహదారిని మూసివేయడంతో ఇవాళ ఉదయం కొన్ని గంటల పాటు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తులకు కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో…ఘజియాబాద్ జిల్లా కలెక్టర్ అజయ్ శంకర్ పాండే నిన్న సాయంత్రం సరిహద్దును మూసివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో అత్యవసర సేవల వాహనాలు తప్ప ఇతర వాహనాలను అధికారులు అనుమతించలేదు. సరిహద్దులకు ఇరువైపులా వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్కూటర్‌పై తన భార్యతో పాటు ఢిల్లీ నుంచి వస్తున్న ఓ వ్యక్తి తాము ఆస్పత్రికి వెళ్లివస్తున్నామని చెప్పినా పోలీసులు అనుమతించలేదు.

కాగా,కరోనా వైరస్ ప్రభావం అంతగా లేని ప్రాంతాల్లో ఆంక్షలను సడలించేందుకు కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఢిల్లీలో ఇది సాధ్యం కాదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు.