శాంతాక్లాజ్ గెటప్‌లో స్వీట్లు పంచుతున్న ట్రాఫిక్ పోలీసులు

శాంతాక్లాజ్ గెటప్‌లో స్వీట్లు పంచుతున్న ట్రాఫిక్ పోలీసులు

ట్రాఫిక్ గురించి ప్రజలకు అవగాహన పెంచడానికి పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ప్రత్యేక సందర్భాలు వస్తే వాటిని సైతం సద్వినియోగం చేసుకోవాలనే ఆరాటంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా శాంతాక్లాజ్ గెటప్‌లో సందడి చేశాడు ఓ పోలీస్. గోవా రాజధాని పనాజీలో ఈ దృశ్యం కనిపించింది. స్వీట్లు పంచిపెడుతూ.. పనిలో పనిగా ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తున్నాడు. ఇలా ఒక్కరు మాత్రమే కాదు.. పలు జంక్షన్లలో శాంతాక్లాజ్ దుస్తులు ధరించి పదుల సంఖ్యలో పోలీసులు ఇలా చేశారు. 

క్రిస్మస్ తాతను పశ్చిమ దేశాల్లో  శాంతాక్లాజ్ అంటారు. నెత్తి మీద టోపి, తెల్లని పొడవైన గడ్డం, మీసాలు, ఎర్రటి డ్రెస్, ముఖంపై చెరగని చిరునవ్వుతో చిన్నారుల్ని ఆకట్టుకునే శాంతాక్లాజ్ అసలు కథ ఇది. 

13 వ శతాబ్దంలో డెన్మార్క్‌లో సెయింట్ నికొలస్ అనే క్యాథలిక్ బిషప్ ఉండేవాడు. అదే ఊరిలోని ఒక నిరుపేద రైతు తన ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయలేక ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అతని సమస్యను గుర్తించిన బిషప్ ఒక రాత్రి వేళ ఆ నిరుపేద ఇంటిమీదున్న పొగగొట్టంలో నుంచి 3 బంగారు నాణాలున్న సంచులను జారవిడుస్తాడు. 

అవి నేరుగా జారి  పొయ్యిపక్కనే ఆరేసిన మేజోళ్ళలో (సాక్సులు) పడతాయి.  అవి చూసుకున్న ఆ పేదవాడు  ఎంతో సంతోషపడతాడు. ఆ విషయం తన ఇరుగు పొరుగువారికి ఎంతో ఆనందంగా చెప్పుకుంటాడు. ఈ సంగతి ఆ నోట ఈ నోట పాకి బీదలంతా తమకూ ఎంతోకొంత సాయం అందుతుందని ఎదురుచూడటం మొదలు పెట్టారు. బిషప్ ప్రేరణతో మనసున్న ఎందరో ధనికులు శాంతాక్లాజ్ రూపంలో పేదలకు రహస్యంగా సాయం చేయటం మొదలుపెట్టారు.