అయ్యో పాపం : గణేష్ నిమజ్జనానికి వెళ్లి..ఆరుగురు చిన్నారుల మృతి

  • Published By: madhu ,Published On : September 10, 2019 / 03:06 PM IST
అయ్యో పాపం : గణేష్ నిమజ్జనానికి వెళ్లి..ఆరుగురు చిన్నారుల మృతి

కర్నాటక రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం కోసం వెళ్లిన ఆరుగురు చిన్నారులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉదయం సందడి..సందడి చేసిన చిన్నారులు ఇక లేరని తెలుసుకున్న వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ విషాద ఘటన కోలార్ జిల్లాలో  చోటు చేసుకుంది. 

ఆంధ్రా – కర్నాటక రాష్ట్ర సరిహద్దులోని వి.కోట మండలానికి అతి సమీపంలో కోలార్ జిల్లా..మరతగడ్డ గ్రామం ఉంది. ఇక్కడ సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం గణేష్ నిమజ్జనం జరుగుతోంది. వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. ఊరేగింపుగా నీటి కుంటకు తరలించారు. వేడుకల్లో పాల్గొన్న చిన్నారులు నీటి కుంట వరకు వచ్చారు. ప్రమాదవశాత్తు ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడిపోయారు.

ఇది చూసిన మిగతా చిన్నారులు వారిని కాపాడేందుకు ప్రయత్నించి..నీట మునిగిపోయారు. నీటిలో మునిగిపోయిన ముగ్గురు చిన్నారులు అప్పటికే చనిపోగా..ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. చనిపోయిన వారిలో నలుగురు బాలురు కాగ, ఇద్దరు బాలికలున్నారు.

తేజస్వి, రక్షిత్, రోహిత్, వైష్ణవి, ధనుష్ లుగా గుర్తించారు. మరొకరిని గుర్తించాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా ప్రదేశానికి
చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

Read More : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఊర్మిళా మటోండ్కర్