ఆపరేషన్ బీజేపీ మొదలెట్టిన మమత…టీఎంసీలో చేరిన బీజేపీ ఎంపీ భార్య

ఆపరేషన్ బీజేపీ మొదలెట్టిన మమత…టీఎంసీలో చేరిన బీజేపీ ఎంపీ భార్య

BJP MP’s Wife JoinsTrinamool త్వరలో వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎలాగైనా సరై ఈ సారి గెలిచి అధికారంలోకి రావాలని బీజేపీ బలంగా ప్రయ్నిస్తోన్న విషయం తెలిసిందే. అటు మమత కూడా అధికారాన్ని నిలపుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కొద్ది రోజులుగా తృణముల్ కాంగ్రెస్ లోని అసమ్మతి స్వరాలు ఆమెకు తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీలోకి జంప్ అవుతుండటంతో మమతా బెనర్జీకి ఇది కొత్త సవాల్ గా మారింది.

అయితే,ఇప్పుడు మమత కూడా బీజేపీకి తన స్ట్రైల్ లో దెబ్బ రుచిచూపించాలని డిసైడ్ అయింది. తన గేమ్ ఫ్లాన్ ని చాపకిందనీరులా నెమ్మదిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తోంది. బీజేపీకి చెందిన నేతలనే తన పార్టీలోకి లాగేసుకునే ప్రయత్నాలను మమత ప్రారంభించినట్లు తెలుస్తోంది.

బెంగాల్ కి చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ భార్య సుజాత మోండాల్ ఖాన్ ఇవాళ(డిసెంబర్-21,2020)తృణముల్ కాంగ్రెస్ లో చేరారు. అయితే ఈ పరిణామం బీజేపీని కొంచెం కలవరపాటుకి గురిచేసినట్లు సమాచారం.

అయితే,ఎంపీ సౌమిత్ర ఖాన్ గతంలో తృణముల్ కాంగ్రెస్ నాయకుడే. 2014లో బిషన్ పూర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎంపీగా పోటీ చేసి విజయం కూడా సాధించారు. అయితే 2019లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను 2019 జనవరిలో ఆయనను తృణముల్ పార్టీ నుంచి తొలగించింది మమతా బెనర్జీ. దీంతో ఆయన బీజేపీలో చేరి గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

అయితే సౌమిత్ర ఖాన్ విజయంలో ఆయన భార్య సుజాత మోండాల్ ఖాన్ పాత్ర చాలా కీలకమైనది. ఓ క్రిమినల్ కేసు నేపథ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం పోటీ చేసిన బిషన్ పూర్ నియోజకవర్గంలో ఆయన అడుగుపెట్టలేని పరిస్థితుల్లో ఆయన భార్య సుజాత మోండాల్ ఖాన్ ఒంటిచేత్తో క్యాంపెయిన్ నడిపించి తన భర్త విజయంలో కీలక పాత్ర పోషించింది. సుజాత ఖాన్ బీజేపీ సభ్యురాలుగా గతంలో మోడీతో కలిసి వేదికను కూడా పంచుకున్నారు.