త్రిపుర సీఎంపై తిరుగుబాటు..బీజేపీలో కలవరం

  • Published By: madhu ,Published On : October 12, 2020 / 11:52 AM IST
త్రిపుర సీఎంపై తిరుగుబాటు..బీజేపీలో కలవరం

tripuras biplab deb : త్రిపుర సీఎంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలు ఢిల్లీలో మకాం వేశారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రస్తుత ఎమ్మెల్యే సుదీప్‌ రాయ్‌ బార్మన్‌ నేతృత్వంలో దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలవాలని అనుకుంటున్నారు. ఆయనతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు వీరు కలుస్తారని సమాచారం.



వీరంతా త్రిపుర భవన్ లోని ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పును కోరుకుంటున్నారని ఆయన ఎమ్మెల్యే సుదీప్ వెల్లడిస్తున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదీప్ మాట్లాడుతూ…రాష్ట్రంలో జరుగుతున్న పాలన గురించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని 12 మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నామని, సీఎం అనుచిత వ్యాఖ్యలతో పార్టీని అనేక సార్లు ఇబ్బందుల్లో పడేశారని వెల్లడించారు.



ముఖ్యమంత్రి నియంతృత్వ స్వభావాన్ని భరించలేక ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు డిప్యూటేషన్‌, స్వచ్ఛంద పదవీ విరమణతో రాష్ట్రాన్ని వీడుతున్నారని వివరించారు. తామంతా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పని చేసే వారమని, రాష్ట్రంలో భవిష్యత్ లో కూడా బీజేపీ అధికారంలో ఉండాలని తాము భావిస్తున్నామని, లేనిపక్షంలో కాంగ్రెస్, వామపక్షాలు బలపడుతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.



త్రిపురలో బీజేపీ, దాని మిత్రపక్షమైన ఇండిజీనస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర(ఐపీఎఫ్‌టీ) రాష్ట్రంలో 25 సంవత్సరాల లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని తొలగించి 2018లో అధికారంలోకి వచ్చింది. 60 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తరఫున 36 మంది, ఐపీఎఫ్‌టీ తరఫున 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎమ్మెల్యే సుదీప్ వ్యవహారశైలిని అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.