అతి తీవ్ర తుపానుగా “మహా”

  • Published By: chvmurthy ,Published On : November 3, 2019 / 01:35 AM IST
అతి తీవ్ర తుపానుగా “మహా”

అరేబియా సముద్రంలో కొనసాగుతున్న మహా తీవ్ర తుపాను పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తూర్పు మధ్య అరేబియా సముద్ర తీర ప్రాంతంలో గుజరాత్ లోని వీరవల్ కి దక్షిణ నైరుతి దిశగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం (నవంబర్ 3, 2019) నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 

మరో వైపు గల్ఫ్ ఆఫ్ ధాయిలాండ్ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావం వల్ల సోమవారం (నవంబర్, 4) ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి.. రెండు మూడు రోజుల్లో  తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో ఆది, సోమ వారాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.