ఒక్క రోజు సీఎంలా…ఒక్క రోజు ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడు

  • Published By: venkaiahnaidu ,Published On : February 19, 2020 / 04:20 PM IST
ఒక్క రోజు సీఎంలా…ఒక్క రోజు ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ అయ్యాడు

ఒకే ఒక్కడు సినిమాలోని ఒక్క రోజు సీఎం సీను అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో జరిగినట్లే.. .ఇప్పుడు నిజ జీవితంలోనూ జరిగింది.  అయితే అది ముఖ్యమంత్రి పదవి కాదు. ట్రాఫిక్ పోలీసుగా. 

 ఉత్తరప్రదేశ్‌లోని  ఫిరోజాబాద్‌లోని మంగళవారం(ఫిబ్రవరి-17,2020) తుండ్ల ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సోను చౌహాన్ అనే యువకుడు ట్రాఫిక్‌ జామ్‌ వల్ల బాగా ఇబ్బంది పడ్డాడు. దీంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ట్రాఫిక్ జామ్ పై కంప్లెయింట్ చేశాడు. ఎస్పీ సచింద్ర పటేల్‌కు లేఖ అందజేశాడు. అయితే ఆ ట్రాఫిక్‌ను నియంత్రించాలంటూ చౌహాన్‌కు ఎస్పీ సూచించారు. 2 గంటలు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఇన్‌చార్జ్‌గా చౌహాన్ ను  నియమించారు. 

ఆ మేరకు 2 గంటల పాటు ట్రాఫిక్ సర్కిల్ ఆఫీసర్‌గా చౌహాన్‌కు బాధ్యతలు అప్పగించారు. అతనికి సహాయంగా సర్కిల్ ఆఫీసర్ స్థాయి అధికారిని నియమించాడు. అయితే చౌహాన్ ఎస్పీ ఇచ్చిన అవకాశాన్ని వెంటనే అందిపుచ్చుకుని.. తుండ్లా ఏరియాలోని సుభాష్ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ నియంత్రణ చేసే పని చేపట్టాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుతున్న చాలా మందికి చలాన్లు విధించాడు. రోడ్డుపై భిక్షాటన చేసేవారిని పంపించేశాడు.

ప్రత్యామ్నాయ దారులను తెలుపుతూ వాహనదారులకు సూచనలు చేశాడు. ఇలా తనకు ఇచ్చిన రెండు గంటల సమయాన్ని చక్కగా వినియోగించుకుని ట్రాఫిక్ నియంత్రణలో చౌహాన్ విజయం సాధించాడు. కాగా, తన అనుభవం గురించి స్పందించిన సోను చౌహాన్.. ట్రాఫిక్ నియమాలు ఒక్క రోజు పాటిస్తే సరిపోదని, ప్రతి రోజు ఆచరిస్తేనే ట్రాఫిక్ సమస్య ఉండదని తెలిపాడు.