టీఆర్పీ స్కామ్ : అర్నాబ్-బార్క్ సీఈవో వాట్సాప్ చాట్ వైరల్

టీఆర్పీ స్కామ్ : అర్నాబ్-బార్క్ సీఈవో వాట్సాప్ చాట్ వైరల్

TRP Scam గత ఏడాది అక్టోబర్ లో టీఆర్‌పీ వెలుగులోకి వచ్చిన టీఆర్పీ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రిపబ్లిక్ టీవీ సహా పలు టీవీ ఛానెళ్లు టీఆర్పీ రిగ్గింగ్ ‌కు పాల్పడుతున్నాయని హన్సా రీసెర్చ్ గ్రూప్ ద్వారా బార్క్ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటికొచ్చింది. పలు వార్తా ఛానెళ్లు టీఆర్పీ కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కొన్ని వారాలపాటు టీవీ ఛానెళ్ల వ్యూయర్‌షిప్‌ ను లెక్కించే బార్క్((Broadcast Audience Research Council)న్యూస్ ఛానళ్లకు రేటింగ్స్ ను నిలిపివేసిన విషయం తెలిసిందే.

అయితే, ఇప్పుడు ఈ టీఆర్పీ స్కామ్ కేసు ఊహించని మలుపు తిరిగింది. టీఆర్పీ స్కామ్ కేసుని ముంబై పోలీసులు…ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ “రిపబ్లిక్‌ టీవీ” చీఫ్‌ అర్నబ్‌ గోస్వామి, బార్క్‌ మాజీ సీఈవో పార్థోదాస్‌ గుప్తా సహా పలువురి మధ్య జరిగిన వాట్సాప్‌ సంభాషణలు బయటకు లీకయ్యాయి. దాదాపు 500 పేజీలకుపైగా ఉన్న ఈ చాట్‌ మెసేజ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కొన్ని చాట్‌లలో టీఆర్పీకి సంబంధించి.. అవసరమైతే పార్థోదాస్‌కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సాయం చేస్తానంటూ అర్నబ్‌ గోస్వామి హామీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరో చాట్‌లో మంత్రులంతా మనతోనే ఉన్నారని చెబుతున్నట్లు ఉంది. కండీవలి పోలీసు స్టేషన్‌లో ఈ కేసు నమోదైనట్లు కనిపిస్తున్న ఈపీడీఎఫ్‌ పేజీల్లో ప్రతి పేజీకి పలువురి సంతకాలు ఉండటం గమనార్హం.

మరోవైపు,జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్‌కు గత రాత్రి బ్లడ్ ప్రెషర్, షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో… కిందపడిపోయారు. దాంతో మహారాష్ట్ర లోని తలోజా జైలు అధికారులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్చినట్లు తెలిసింది. ఆయన భార్య సామ్రాజ్ఞి దాస్‌గుప్తా చెప్పినదాని ప్రకారం… ఆయన్ని ఈ రోజు ICUకి తరలించినట్లు తెలిసింది.