దేశంలో ఫస్ట్ టైమ్ : లారీకి రూ. 6లక్షల ఫైన్

  • Published By: madhu ,Published On : September 14, 2019 / 12:03 PM IST
దేశంలో ఫస్ట్ టైమ్ : లారీకి రూ. 6లక్షల ఫైన్

మోటార్ వెహికల్ చట్టం చుక్కలు చూపిస్తోంది. భారీగా విధిస్తున్న ఫైన్‌లు చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వందలు..వేలు..కాదు లక్షల్లో జరిమానాలు విధిస్తున్నారు. అదేమిటంటే..కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి. రూల్ ఈజ్ రూల్ అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. బిల్లులు చెల్లించలేని కొంతమంది వాహనాలను పోలీసులకే వదిలేస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ ట్రక్కుకు రూ. 2 లక్షలు వేసిన విషయం మరిచిపోక ముందే..లారీకి రూ. 6 లక్షల ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. 

ఓ బండికి భారీ జరిమాన వేయడం దేశంలో ఫస్ట్ టైమ్ అంటున్నారు. నాగాలాండ్‌‌కు చెందిన లారీ (NL-087079) నెంబర్ గల లారీని రవాణా అధికారులు సాంబలాపూర్‌లో చెక్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందని తేలింది. రూ. 6 లక్షల 53 వేల 100 రూపాయల ఫైన్ కట్టాలంటూ రసీదును చింపి డ్రైవర్ చేతిలో పెట్టారు. సెప్టెంబర్ 10వ తేదీన ఈ ఫైన్ వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రశీదు బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

తాము తనిఖీలు నిర్వహించిన సమయంలో ఈ విషయం తేలిందని సాంబ్లాపూర్ రీజనల్ ట్రాన్స్ పోర్టు ఆఫీసర్ లలిత్ మోహన్ బెహ్రా వెల్లడించారు. 2014 నుంచి రోడ్ ట్యాక్స్ కట్టలేదని తెలిపారు. ఇన్సూరూన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ లేదని, నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణీకులను తరలిస్తున్నారని వెల్లడించారు. ఒడిషా మోటార్ వెహికల్ చట్టం ప్రకారం తాము ఫైన్ వేసినట్లు తెలిపారు. 

సెప్టెంబర్ 03వ తేదీన సాంబ్లాపూర్‌లో ట్రక్ డ్రైవర్‌ కు రూ. 86 వేల జరిమాన విధించిన సంగతి తెలిసిందే. దీంతో లారీ యజమాని చర్చలు చేసి రూ. 70 వేలు చెల్లించాడు. ఇటీవలే ఢిల్లీలో ట్రక్కుకు రూ. 2 లక్షలు, రాజస్థాన్‌లో ఓ లారీకి రూ. లక్షా 41 వేల ఫైన్ వేశారు.