ట్రంప్ భారత పర్యటనతో లాభపడేదెవరు!

  • Published By: venkaiahnaidu ,Published On : February 23, 2020 / 02:22 PM IST
ట్రంప్ భారత పర్యటనతో లాభపడేదెవరు!

రెండురోజుల ట్రంప్ భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సోమవారం(ఫిబ్రవరి-24,2020)భారత్ లో అడుగుపెడుతున్నారు ట్రంప్. ఈ రెండురోజుల ట్రంప్ పర్యటన కోసం భారత ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెడుతోంది.  మరే అంశానికీ ఇవ్వనంత ప్రాధాన్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది.

అయితే ట్రంప్ పర్యటనకు మోడీ సర్కార్ వందల కోట్లు ఖర్చు చేస్తుండటంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ట్రంప్ టూర్ వల్ల అమెరికాకే తప్ప భారత్‌కు ప్రయోజనం ఏమీ ఉండదని మండిపడుతున్నాయి. ఈ ఆరోపణలను పక్కన పెడితే వాస్తవ చిత్రంలో చూస్తే ఈ పర్యటన వల్ల రెండు దేశాలకూ కొన్ని ప్రయోజనాలున్నట్లు కనిపిస్తోంది.

ఆసియాలో బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ నుంచీ చక్కటి సహకారం అమెరికాకు లభించనుంది. వ్యక్తిగతంగా ట్రంప్ కు కూడా ఈ టూర్ బాగా ఉపయోగపడుతుంది. భారత్ లో ట్రంప్ కుబంబం చాలా పెట్టుబడులు పెట్టింది. ట్రంప్ టవర్స్ పేరుతో ఇప్పటికే భారత్ లో ఆకాశ హరమ్యాలను నిర్మించే పనిలో ట్రంప్ కుటుంబం నిమగ్నమై ఉంది. ముంబై,ఢిల్లీ వంటి చోట్ల ట్రంప్ కుటుంబం వ్యాపారాలు చేస్తోంది. ట్రంప్ పర్యటన ఈ వ్యాపారాలకు కూడా మంచి బూస్ట్ ఇవ్వనుంది.

See Also>>ట్రంప్ పర్యటన స్నేహం పెరిగేలా చేస్తుంది: మోడీ

ఇప్పుడాయన అమెరికా నుంచీ పాలు, కోళ్లను భారత్‌కు దిగుమతి చేస్తామంటున్నారు. దీనిపై ఇండియా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనికి ఒప్పుకుంటే అమెరికాలో మిగిలిపోతున్న టన్నుల కొద్దీ చికెన్ లెగ్ పీస్ లను ఇండియాకు పంపేందుకు వీలవుతుంది. అమెరికన్లు లెగ్ పీస్ లను తినరన్న విషయం తెలిసిందే.

అమరోవైపు ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఖ్యాతి మరింత పెరగనుంది. ప్రస్తుతం భారత్… తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాల్లో చైనా తర్వాత రెండో పెద్దన్నగా ఎదుగుతోంది. అంతర్జాతీయ అంశాల్లో మరింత దూసుకెళ్లేందుకు అమెరికా సహకారం భారత్‌కు ప్రయోజనం కలిగించనుంది. అటు ట్రంప్… ఈ ఏడాది చివర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల మద్దతు కూడగట్టేందుకూ, వాణిజ్య పరంగా భారత్‌తో మరిన్ని డీల్స్ కుదుర్చుకునేందుకూ ఈ టూర్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

స్వాతంత్ర్యం తర్వాత రష్యాతో చెలిమి చేసిన భారత్….గత 20 ఏళ్లుగా రూట్ మార్చుకుంటోంది. అమెరికాకు దగ్గరవుతోంది. అటు అమెరికా కూడా ఆసియాలో చైనాను ఎదుర్కోవడానికి భారత్ సాయం, మద్దతు తీసుకుంటోంది. వాణిజ్యపరంగా కూడా భారత మార్కెట్‌ను బాగా ఉపయోగించుకుంటోంది. ఆయుధాల డీల్స్ కుదుర్చుకోవడంలో కూడా అమెరికా ముందుంది. 2007 తర్వాత అమెరికా నుంచీ భారత్…1700 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు కొనింది. వీటిని మరింత పెంచేందుకు అమెరికా యత్నిస్తోంది. అదే సమయంలో అమెరికాతో డీల్స్ వల్ల ఆ దేశం నుంచీ భారీగా పెట్టుబడులు, పెద్ద కంపెనీల రాక దిశగా భారత్ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్యా ఏటా 12000 కోట్ల డాలర్ల బిజినెస్ జరుగుతోంది. దీన్ని 50000 కోట్లకు చేర్చాలన్నది ఇప్పుడు వాటి ముందున్న టార్గెట్.

భారత్ తమ దిగుమతులపై వేస్తున్న సుంకాల్ని తగ్గించాలంటున్న ట్రంప్… అదే జరిగితే… భారతీయులకు వీసాల జారీ విషయంలో మెత్తబడే అవకాశాలుంటాయి. ఇలా రెండు దేశాలకూ ట్రంప్ ఇండియా టూర్ ప్రయోజనాలు చేకూర్చనుంది. కీలకమైన జమ్మూకాశ్మీర్ విషయంలో ప్రస్తుతానికి పాకిస్థాన్‌కి అనుకూలంగా ఉన్న అమెరికా… భారత్‌కు మద్దతుగా నిలిస్తే… అది ఇండియాకు అంతర్జాతీయస్థాయిలో కలిసొచ్చే అంశం అవుతుంది. పాకిస్థాన్‌కి అంతర్జాతీయంగా చెక్ పెట్టినట్లవుతుంది. తాజా పర్యటన ద్వారా ఈ విషయంలో అమెరికా భారత్ వైపు మొగ్గుచూపే అవకాశాలున్నాయి. అలా చేయడం ద్వారా… వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలిచే అవకాశాలు మెరుగవుతాయి. 

Read More>>ట్రంప్ పర్యటనకు ఒక్క రోజు ముందు…అహ్మదాబాద్ లో కూలిన VVIP ఎంట్రీ గేట్