మత స్వేచ్చపై చర్చించనున్న ట్రంప్

  • Published By: madhu ,Published On : February 22, 2020 / 11:21 AM IST
మత స్వేచ్చపై చర్చించనున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో రెండు రోజుల్లో భారతదేశంలో అడుగుపెట్టబోతున్నారు. కొద్ది రోజుల నుంచే కేంద్రం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌కు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే..భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో..ట్రంప్ ఏం చర్చించనున్నారనే దానిపై తెగ ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యపరంగా ఉన్న బేదాభిప్రాయాలను తొలగించే విధంగా చర్చలు ఉంటాయని టాక్.

కానీ..తాజాగా…అమెరికా వైట్ హౌజ్‌ అధికారి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బహిరంగ ప్రసంగాల్లో, అంతర్గత చర్చల్లో మత స్వేచ్చ అంశంపై ట్రంప్ మాట్లాడొచ్చని చెప్పారు. ప్రజాస్వామ్యం, మత స్వేచ్చ ట్రంప్ బహిరంగంగా, ప్రైవేటుగా మాట్లాడుతారని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ సిటిజెన్ షిప్‌లపై తీవ్ర వ్యతిరేకత ఉన్న క్రమంలో.. వైట్ హౌజ్ అధికారి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. 

పాలనపరమైన అంశాల్లో మత స్వేచ్చ అనేది కూడా కీలకమని..అందుకే ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించబోతున్నారని తెలిపారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం, సంప్రదాయాలు, సంస్థలపై తమకు చాలా గౌరవం ఉందని, ఆ సంప్రదాయాలను కొనసాగించేందుకు తాము ఇండియాను ప్రోత్సాహిస్తూనే ఉంటామన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వంటి అంశాలను లేవనెత్తే ఆలోచన కూడా ఉందన్నారు. మైనార్టీలకు ఎలాంటి ప్రాధాన్యతనిస్తాం..ఎలా కలుపుకుని ముందుకు వెళుతామో మొదటిసారి ప్రధానిగా అయిన అనంతరం మోడీ వెల్లడించారనే విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యంగానికి కట్టుబడి మత, స్వేచ్చ, సమానత్వం అందరికీ అందుతున్నాయో లేదో ప్రపంచం గమనిస్తుందన్నారు. 

భారతదేశం..పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి ట్రంప్ కృషి చేయడం జరుగుతుందని, ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చలు జరపాలని ఆయన సూచించే అవకాశం ఉందన్నారు. నియంత్రణ రేఖ వెంబడి శాంతి నెలకొనేలా ఉండాలని, ఉద్రిక్తతలు పెంచే ప్రకటనలకు దూరంగా ఉండాలన్నారు. అప్ఘనిస్తాన్‌ విషయంలో ఆయన స్పందించారు. శాంతి ప్రక్రియకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం ముందుకొస్తుందని తెలిపారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, ఇంధన రంగాల్లో పటిష్టమైన సంబంధాలు నెలకొనేలా ట్రంప్ పర్యటన ఉంటుందన్నారు. మరి

* ట్రంప్ పర్యటనలో ఎలాంటి అంశాలు లేవనెత్తుతారో చూడాలి. 
* 2020, ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారతదేశంలో ట్రంప్ పర్యటన.

* తొలి రోజు గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొతెరా స్టేడియం వరకు ట్రంప్, మోడీ రోడ్ షో. 
* రోడ్డుకు ఇరువైపులా ప్రజలతో స్వాగతం పలికేందకు ఏర్పాట్లు. 

* నమస్తే ట్రంప్ పేరిట మొతరా స్టేడియంలో స్వాగత సభ. 
* రెండో రోజు తాజ్ మహల్ సందర్శన. 
* ఈ సందర్భంగా ట్రంప్‌కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు.