బంధువులా రాబందులా : బతికుండగానే చితిపైకి చేర్చారు

10TV Telugu News

బీహార్ : మానవత్వం మంటగలిసింది. బంధాలు, అనుబంధాలు మాయమవుతున్నాయి. మనిషి రాతి మనిషిలా మారుతున్నాడు. సొంత బంధువులే ప్రాణాలు తీయాలని చూశారు. బతికుండగానే చితిపేర్చి సజీవ దహనం చేసేందుకు యత్నించారు. బీహార్ రాష్ట్రాంలోని భోజ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. స్థానిక సారికపూర్ స్మశానవాటికలో ఓ వివాహితకు చితి పేర్చారు. నిప్పు పెట్టడానికి కూడా రెడీ అయ్యారు. అయితే ఆ మహిళ చనిపోలేదు, ప్రాణాలతోనే ఉంది. బతికుండగానే ఆమెను సజీవ దహనం చేసేందుకు కుటుంబసభ్యులే సిద్ధమయ్యారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

రంగంలోకి దిగిన పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. సొంత బంధువులే ఆమెను సజీవ దహనం చేసేందుకు ఎందుకు ప్రయత్నించారు అనే వివరాలు తెలుసుకుంటున్నారు. బాధితురాలని లక్ష్మీదేవిగా గుర్తించారు. సందేష్ గ్రామానికి చెందిన రవీంద్ర ఠాకూర్ భార్య. వివాహిత భర్త, అత్త మామలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

 

ఈ ఘటనతో స్థానికులు షాక్ తిన్నారు. మహిళ కుటుంబసభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులను వారు ప్రశంసించారు. సమయానికి పోలీసులు రావడంతో మహిళ ప్రాణాలతో బయటపడిందన్నారు. పోలీసులు రావడంలో 10 నిమిషాలు ఆలస్యమైనా ఘోరం జరిగిపోయి ఉండేదన్నారు.