సర్వ రోగ..సర్వ పాప నివారిణి : తులసి పూజ విశిష్టత..తప్పకుండా తెలుసుకోవాలి

  • Published By: veegamteam ,Published On : December 25, 2019 / 06:49 AM IST
సర్వ రోగ..సర్వ పాప నివారిణి : తులసి పూజ విశిష్టత..తప్పకుండా తెలుసుకోవాలి

తులసి మొక్కను ఆరాధించడం..పూజించటం భారతదేశ ప్రాచీన సంప్రదాయం. సంప్రదాయాల ప్రకారం..తులసి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు..సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం. ఇటు సైన్స్ పరంగా చూస్తే..తులసి ఔషధాల గని. మనిషికి ఒక డాక్టర్ గా పనిచేస్తుంది తులసి మొక్క. ఆయుర్వేదంలో, తులసికి చాలా విశిష్టత ఉంది. తులసి మొక్క ఉన్న ప్రాంతంలో ఎంతో ప్రశాంతత ఉంటుందని డాక్టర్లు సైతం అంటుంటారు.తులసి మొక్కలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని డాక్టర్లుకూడా తెలిపారు. 

ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 న తులసి పూజా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున తులసి మొక్కకు ఉదయాన్నే పూజిస్తారు.పసుపు, కుంకుమతో అలకరించి..జలంతో అభిషేకం చేస్తారు. తులసి పూజ చేసే సమయంలో ప్రత్యేకమైన మంత్రాలను పఠిస్తారు. తులసి మొక్కను పూజించిన తరువాత మొక్క చుట్టూ 7, 11, 21 లేదా 111 సార్లు ప్రదక్షణ చేయాలి. అలా చేస్తే మొక్కలోని ఔషధ గుణాలు మనకు చాలా మేలు చేస్తాయి.  

తులసి పూజ తరువాత తులసి ఆకులను నీటిలో వేసి ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. తరువాత ఆ నీటిని కుటుంబంలో అందరూ తాగాలి. తులసి ఆకులను తినాలి. తులసిని దేవతగా భావించినందున, ఆమెకు 1-బృందా, 2-బృందావని, 3-విశ్వపావని, 4-విశ్వపుజిత, 5-పుష్పసర, 6-నందిని, 7-తులసి మరియు 8-కృష్ణజీవని అనే పేర్లు ఉన్నాయి. తులసిని ఈ  పేర్లను పఠిస్తూ తులసిని ఆరాధించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. తులసిని పూజించడమే కాదు..ఈ రోజున కొత్తగా తులసి మొక్కను ఇంట్లో నాటుకోవాలి. 

తులసిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. టీబీ, మలేరియా వంటి అంటు వ్యాధుల చికిత్సలో తులసిని ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులను నిర్మూలించటానికి కూడా తులసి వినియోగిస్తారు. గజ్జి, తామర,  దురదలకు తులసి మంచి మెడిసిన్. జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, ఫ్లూ, జలుబు దగ్గు, శ్వాస కోశ వ్యాధుల్ని నిర్మూలించటానికి తులసి ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా ఒక్క తులసి మొక్క మీ ఇంటిలో ఉంటే ఎటువంటి అంటు వ్యాధులు రావని పలు పరిశోధనల్లో తేలింది.