రైతులకు మద్దతు తెలిపిన ఫారిన్ సెలబ్రిటీలపై కేంద్రం ఆగ్రహం

రైతులకు మద్దతు తెలిపిన ఫారిన్ సెలబ్రిటీలపై కేంద్రం ఆగ్రహం

foreign celebs  కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలకు పైగా ఆందోళన చేస్తోన్న రైతులకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్న ఇంట‌ర్నేష‌న‌ల్ సెల‌బ్రిటీల‌పై తీవ్రంగా మండిప‌డింది కేంద్ర ప్ర‌భుత్వం. ఇది స‌రైన‌ది కాదని, బాధ్య‌తారాహిత్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది.

బుధవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో..ఇది దేశంలోని ఓ ప్రాంతంలో కొద్ది మంది రైతులు మాత్ర‌మే చేస్తున్న ఆందోళ‌న. ఇది భార‌త‌దేశ అంత‌ర్గత వ్య‌వ‌హారం. ఇలాంటి వాటిపై స్పందించే స‌మ‌యంలో వాస్త‌వాలు తెలుసుకోవాలి. వాటిని అర్థం చేసుకోవాలి. ఇలాంటి అంశాంపై సెల‌బ్రిటీల సెన్సేష‌న‌లిస్ట్ సోష‌ల్ మీడియా హ్యాష్‌ట్యాగ్‌లు, కామెంట్లు స‌రికావు. వారిది బాధ్య‌తా రాహిత్యం అని స్ప‌ష్టం చేసింది.

రైతుల్లోని కొన్ని స్వార్థ‌ప‌ర‌మైన గ్రూపులు త‌మ ఎజెండాను ఈ ఆందోళ‌న‌ల‌పై రుద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని, ఈ గ్రూపులే ఇండియాకు వ్య‌తిరేకంగా అంత‌ర్జాతీయ మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నాయ‌ని విదేశాంగశాఖ తన ప్రకటనలో పేర్కొంది. అలాంటి వాళ్ల వ‌ల్లే కొన్ని దేశాల్లో మ‌హాత్మా గాంధీ విగ్ర‌హాల ధ్వంసం జ‌రుగుతోంద‌ని, ఇది ఇండియాను చాలా బాధించింద‌ని చెప్పింది. జనవరి-26న ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా పోలీసులు సంయమనంతో ఉన్నారని సమర్థించుకుంది భారత విదేశాంగశాఖ.

Image

కాగా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనకు మద్దతుగా మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా, ప్ర‌ముఖ పాప్ సింగ‌ర్ రిహానా, యాక్టివిస్ట్ గ్రెటా థ‌న్‌బ‌ర్గ్‌, అమెరికా ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారిస్ మేన‌కోడ‌లు, లాయ‌ర్ మీనా హారిస్ సహా పలువురు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. మనమెందుకు దీని గురించి మాట్లాడడం లేదంటూ రైతుల ఆందోళనపై సీఎన్ఎన్ కథనాన్ని పాప్ సింగ‌ర్ రిహానా మంగళవారం చేసిన ట్వీట్ చాలా సేపు ట్విట్టర్‌లో ట్రెండ్ అయ్యింది. కొంతమంది ఆమెకు మద్దతు తెలిపితే.. పూర్తి స్థాయి అవగాహన తర్వాత స్పందించాలని మరికొంతమంది హితవుపలికారు. రిహానా బాటలో మరికొంత మంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు.. రైతులకు మద్దతుగా ట్వీట్లు చేశారు. రైతులను రాజకీయాల కోసం పెయిడ్ ఆర్టిస్ట్‌లతో పోల్చడాన్ని మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా తప్పుబట్టారు. రైతులను పెయిడ్ ఆర్టిస్ట్‌లు అంటారా? అంటూ ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహం వ్యక్తం చేశారు.