కవలల హత్య : యూపీ, మధ్యప్రదేశ్‌లో హై టెన్షన్

  • Published By: madhu ,Published On : February 24, 2019 / 12:17 PM IST
కవలల హత్య : యూపీ, మధ్యప్రదేశ్‌లో హై టెన్షన్

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కవలల దారుణ హత్యపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముక్కు పచ్చలారని కవలలు విగతజీవులుగా కనిపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. విధ్వంసానికి పాల్పడ్డారు. పిల్లలు కిడ్నాపైన ప్రదేశానికి సమీపంలో ఉన్న జానకికుంద్ షాపింగ్ కాంప్లెక్స్‌ను కొల్లగొట్టారు. కొన్ని దుకాణాలకు నిప్పు పెట్టారు. ఆస్తులపై విరుచుకపడ్డారు. అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. 

రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపారవేత్తకు 5 ఏళ్ల శ్రేయాన్షు, ప్రియాన్షు కవల పిల్లలున్నారు. వీరు చిత్రకూట్ సమీపంలో ఓ స్కూల్‌లో చదువుకుంటున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన పిల్లలు అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వారి కోసం గాలింపులు చేపట్టారు. రూ. 50 లక్షలు ఇస్తే పిల్లలను వదిలిపెడుతామని యూపీకి చెందిన కిడ్నాపర్లు వ్యాపారిని బెదిరించారు. పిల్లలను తమకు అప్పచెప్పాలని డిమాండ్ చేసిన డబ్బును ఇచ్చేశారు. పిల్లలు క్షేమంగా వస్తారని ఆశించిన పేరెంట్స్‌కు షాక్ తెప్పించే వార్త వినిపించింది. 

గాలింపులు చేపడుతన్న పోలీసులకు బండా ప్రాంతంలో యుమునా నదీ తీరంలో శ్రేయాన్షు, ప్రియాన్షులు శవాలుగా తేలారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురై ఆందోళనలు చేపట్టారు. ఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ సీఎం యోగి రాజీనామా చేయాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పీసీ శర్మ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పిల్లలు హత్యకు గురికావడంతో పౌరుల భద్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని, ప్రభుత్వ వైఫల్యం మరోసారి బయటపడిందని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు.