కరోనా వ్యాక్సిన్‌..ముందంజలో 2 భారత కంపెనీలు

  • Published By: venkaiahnaidu ,Published On : July 30, 2020 / 03:46 PM IST
కరోనా వ్యాక్సిన్‌..ముందంజలో 2 భారత కంపెనీలు

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా భారత్ గట్టి పోరాటమే చేస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి డా. హర్షవర్ధన్ అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ రూపకల్పనలో భారతీయ కంపెనీలు, శాస్త్రవేత్తలు ఎంతో గొప్పగా కృషి చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. భారత్‌కు చెందిన రెండు కంపెనీలు క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు

మహమ్మారిని పారద్రోలడంలో కృత నిశ్చయంతోనే ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. కోవిడ్‌కు వ్యతిరేకంగా సీఎస్‌ఐఆర్ చేసిన సాంకేతిక పురోగతిని ఆయన ప్రశంసించారు. సీఎస్‌ఐఆర్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు. కరోనా ఉపశమన చర్యలకై కంపెనీలు, శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు, ప్రయోగ దశ ఫలితాలకు సంబంధించిన వివరాలతో కూడిన.. సీఎస్‌ఐఆర్‌(కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌, ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌) టెక్నాలజీస్‌ ఫర్‌ కోవిడ్‌-19 మిటిగేషన్‌ కంపెడియం(సారాంశపట్టిక)ను ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…భారత్‌కు చెందిన రెండు కంపెనీలు కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్‌ను పూర్తి చేసేశాయి. ఈ విషయం చాలా గర్వకారణం అని ఆయన ప్రశంసించారు. కాగా హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్ ఇప్పటికే ‘కోవాక్సిన్‌ మానవ పరీక్షలు ప్రారంభించగా‌, పుణే కేంద్రంగా పనిచేసే సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే.

కోవిడ్‌-19పై పోరులో అలుపెరుగక కృషి​ చేస్తున్న వైద్య నిపుణులపై ప్రశంసలు కురిపించారు హర్షవర్ధన్. హైడ్రో క్లోరోక్వీన్‌ను ఇప్పటికే 150 దేశాలకు సరఫరా చేస్తున్నామని డా. హర్షవర్ధన్ తెలిపారు. ఇక దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 16 లక్షలకు చేరువగా ఉన్న నేపథ్యంలో.. రికవరీ రేటు ఊరట కలిగించే విషయమని హర్షవర్ధన్‌ అన్నారు. ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మందికి పైగా పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. మిగతా పేషెంట్లు కూడా త్వరలోనే కోలుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ఇతర దేశాలతో పోలిస్తే మరణాల రేటు కూడా తక్కువగా ఉండటం సానుకూల అంశమని తెలిపారు.