NC Party : ఫరూక్ అబ్దుల్లాకి బిగ్ షాక్..ఎన్సీకి కీలక నేతలు రాజీనామా..రేపు బీజేపీలోకి!

ఫరూక్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ (NC)పార్టీకి గట్టి దెబ్బ తగిలింది.

NC Party : ఫరూక్ అబ్దుల్లాకి బిగ్ షాక్..ఎన్సీకి కీలక నేతలు రాజీనామా..రేపు బీజేపీలోకి!

Jk

NC Party ఫరూక్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ (NC)పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీ ప్రముఖ నేతలు దేవేందర్‌సింగ్‌ రాణా,సూర్జిత్ సింగ్ స్లతియాలు ఆదివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఎన్సీకి రాజీనామా చేసిన దేవేందర్‌సింగ్‌ రాణా,సూర్జిత్ సింగ్ స్లతియాలు సోమవారం ఢిల్లీలో బీజేపీలో చేరే అవకాశముందని సమాచారం. కాగా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌‌కు రాణాకు స్వయానా తమ్ముడు కావడం విశేషం.

దేవేందర్‌సింగ్‌ రాణా,సూర్జిత్ సింగ్ స్లతియాలు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా వీరి రాజీనామాలను ఆమోదించారు. వీరిపై తదుపరి చర్యలు గానీ లేదా వ్యాఖ్యలు చేయడం గానీ అవసరం లేదని జమ్ముకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (జేకేఎన్‌సీ) ట్విట్టర్‌ ద్వారా తెలిపింది.

కాగా,జమ్ముకశ్మీర్‌లో ఫరుఖ్‌ అబ్దుల్లా ముఖ్య అనుచరుడుగా దేవేందర్‌సింగ్‌ రాణాకు పేరుంది. జమ్మూ ప్రాంతంలో ఎన్సీ పార్టీ ప్రెసిడెంట్ గా రాణా ఇప్పటివరకు కొనసాగారు. జమ్ముకశ్మీర్‌లో ముస్లిం, గుజ్జర్ కమ్యూనిటీ ప్రజల మద్దతును కూడగట్టడంలో కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. 2014లో జమ్ములోని నాగరోటా అసెంబ్లీ స్థానం నుంచి ఎన్సీ టికెట్‌పై రాణా గెలిచాడు. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజకీయ సలహాదారుగా కూడా రాణా పనిచేశారు. ఫరూక్‌ అబ్దుల్లా సన్నిహితుడుగా, ఎన్సీ పార్టీ ప్రముఖ హిందూ వ్యక్తిగా ఉన్న దేవేందర్ సింగ్ రాణా రాజీనామా జమ్ముకశ్మీర్ రాజకీయాల్లో ఒక కొత్త మలుపును రేకెత్తించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

కాగా, జమ్మూప్రజల ప్రయోజనాలు, వారి ఆశలు, ఆకాంక్షలే తనను ప్రధానమని దేవేందర్‌సింగ్‌ రాణా తెలిపారు. ఎన్సీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి దెబ్బగా అనుకుంటున్నారా అనే ప్రశ్నకు..వ్యక్తులు వస్తుంటారు, వెళ్తుంటారని, ఎన్సీ చాలా పెద్ద పార్టీ అయినందున ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చన్నారు. తనకు ఫరూక్ అబ్దుల్లాతోనూ, ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లాతోనూ సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు.

ALSO READ బీజేపీ నేతలు,వారి బిలియనీర్ ఫ్రెండ్స్ కే భారత్ లో భద్రత