Paralympics : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు

మునుపెన్నడూ లేని విధంగా టోక్యో పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు తమ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా పతకాల పంట పండిస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు.

Paralympics : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు

Paraolympics

Two more medals for India : మునుపెన్నడూ లేని విధంగా టోక్యో పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు తమ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా పతకాల పంట పండిస్తూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. పారాలింపిక్స్‌లో భారత్‌ కు మరో రెండు పతకాలు లభించాయి. పారాబ్యాడ్మింటెన్‌లో స్వర్ణం, సిల్వర్‌ మెడల్స్ దక్కాయి.

టోక్యో పారాలింపిక్స్‌కు కాసేపటితో తెర పడనుండగా… భారత్‌ ఖాతాలో మరో గోల్డ్ వచ్చి చేరింది. పారాబ్యాడ్మింటెన్‌లో కృష్ణ నాగర్‌కు స్వర్ణ పతకం లభించింది. మెన్స్ సింగిల్స్ SH6 ఈవెంట్‌లో గోల్డ్ సాధించాడు కృష్ణ. పారాబ్యాడ్మింటెన్‌లోనే భారత్‌కు ఇప్పటి వరకు రెండు స్వర్ణాలు దక్కాయి. నిన్న పురుషుల సింగిల్స్‌ SH-4 విభాగంలో ఒడిశాకు చెందిన 33 ఏళ్ల ప్రమోద్‌ భగత్‌ స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఇప్పుడు కృష్ణనాగర్‌ మరో పతకం నెగ్గాడు. భారత ఖాతాలో ఇప్పటి వరకు మొత్తం 19 పతకాలు వచ్చాయి. కృష్ణనాగర్‌ గెలుపుతో గోల్డ్ మెడల్స్‌ సంఖ్య ఐదుకు చేరింది.

అంతకుముందు బ్యాడ్మింటన్‌లో సుహాస్‌ యతిరాజ్‌ సిల్వర్‌ మెడల్‌ కైవసం చేసుకున్నాడు. బ్యాడ్మింటన్ SL4 విభాగం ఫైనల్లో ఫ్రాన్స్‌ షట్లర్‌ మజుర్‌ లుకాస్‌ చేతిలో 2-1 తేడాతో ఓడిపోయాడు. దీంతో సుహాస్‌ రజతంతో సరిపెట్టుకున్నాడు. మ్యాచ్‌ ఓడిపోయినా.. సుహాస్‌ చూపించిన పోరాట స్ఫూర్తి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఓడిపోతున్నా.. ఏ దశలో కూడా అతను వెన్ను చూపలేదు. అఖరి వరకు పోరాడాడు. ఇక ఈ పతకంతో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 18కి చేరింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు ఉన్నాయి.

పుట్టుకతోనే ఆతని ఓ కాలు సరిగ్గా లేదు. అయినా ఆ లోపం అతనికి ఏ దశలోనూ అడ్డంకి కాలేదు. దేశంలోనే అత్యున్నత సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసి కలెక్టర్‌గా ఉద్యోగం సంపాదించినా.. పారా బ్యాడ్మింటన్‌ ఆటగాడిగా విజయాలు సాధించినా అతనికే చెల్లింది. అతనే.. కర్ణాటకకు చెందిన 38 ఏళ్ల సుహాస్‌. 1983 జులై 2న కర్ణాటకలోని హస్సాన్‌లో సుహాస్‌ పుట్టారు. పుట్టుకతోనే సుహాస్‌ కాలుకి లోపం ఉంది.

కలెక్టర్‌ నుంచి పారాలింపిక్స్‌లో పతకం వరకు సుహాస్‌ ప్రస్థానం సాగింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌ బుద్ధానగర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌గా పాలన బాధ్యతలు కొనసాగిస్తున్న అతను.. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ తరపున రజతం సాధించాడు. ఆ ఘనత సాధించిన భారత తొలి ఐఏఎస్‌ అధికారిగా చరిత్ర సృష్టించాడు.

అటు చదువుతో పాటు ఇటు బ్యాడ్మింటన్‌పైనా ప్రేమ పెంచుకున్న సుహాస్‌.. రాతతోను, రాకెట్‌తోనూ అద్భుతాలు చేసి చూపించాడు.వివిధ టోర్నీల్లో పతకాలు గెలుస్తూ నిలకడగా రాణిస్తున్న అతను ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌ SL4 విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. 2016 ఆసియా పారా బ్యాడ్మింటన్‌ ఛాంపీయన్‌గా నిలిచిన అతను.. 2018 ఆసియా పారా క్రీడల్లో కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు టోక్యోలోనూ రజత పతకం సాధించి కొత్త చరిత్రకు నాంది పలికాడు.