భారత్ దెబ్బకు పరార్ : సరిహద్దుల్లో పాక్ యుద్ధ విమానాల చక్కర్లు

  • Published By: venkaiahnaidu ,Published On : April 1, 2019 / 03:18 PM IST
భారత్ దెబ్బకు పరార్ : సరిహద్దుల్లో పాక్ యుద్ధ విమానాల చక్కర్లు

సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. సోమవారం(ఏప్రిల్-1,2019) తెల్లవారు జామున 3 గంటలకు పాక్‌ కు చెందిన నాలుగు ఎఫ్‌‌-16 యుద్ధ విమానాలతో పాటు, ఓ భారీ డ్రోను…భారత భూభాగానికి దగ్గర్లో గగనతలంలో చక్కర్లు కొట్టినట్లు భారత రాడార్లు గుర్తించాయి. పంజాబ్‌ లోని ఖేమ్‌ కరణ్ సరిహద్దు ప్రాంతంలోకి అవి వచ్చినట్లు గుర్తించిన వెంటనే భారత్‌ ప్రతిస్పందించింది. సుఖోయ్‌ ఎస్‌యూ-ఎంకేఐ, మిరాజ్‌ యుద్ధ విమానాలతో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయడంతో వెంటనే అవి పాక్ భూభాగం వైపునకు వెనుదిరిగాయి. 

 పుల్వామాలో ఫిబ్రవరి-14,2019న సైన్యంపై జేషే ఉగ్రసంస్థ ఆత్మాహుతి దాడి జరిపి 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న అనంతరం ప్రతీకార చర్యగా పాక్‌ లోని బాలాకోట్ ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే.దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాక్‌ తమ యుద్ధ విమానాలను విమానాలను భారత గగనతలంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. గత నెలలో జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సరిహద్దుకి 10 కిలోమీటర్ల దూరంలో పాక్‌ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. అప్పట్లో కూడా భారత్ ఈ విషయాన్ని వెంటనే గుర్తించి పాక్‌ చర్యలను తిప్పికొట్టింది.