ప్రమాణ స్వీకారానికి ముందు..బాధ్యతల నుంచి తప్పుకున్న థాక్రే

  • Published By: madhu ,Published On : November 28, 2019 / 08:29 AM IST
ప్రమాణ స్వీకారానికి ముందు..బాధ్యతల నుంచి తప్పుకున్న థాక్రే

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు కీలక బాధ్యతల నుంచి ఉద్ధవ్‌ తప్పుకున్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నా సంపాదకుడి బాధ్యతలను వదులుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటివరకూ సామ్నా పత్రిక వ్యవహారాలను ఆయన చూసుకునేవారు. ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. ఆ బాధ్యతలను పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌కు అప్పగించారు. సంజయ్‌ రౌత్‌ ప్రస్తుతం ఆ పత్రిక కార్యనిర్వాహక సంపాదకుడిగా కొనసాగుతున్నారు. సామ్నా పత్రికను 1988లో బాల్‌ ఠాక్రే స్థాపించారు. 

మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టానికి శివాజీ పార్క్‌ వేదిక కాబోతోంది. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తుండడంతో ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయి. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు శివాజీ పార్క్‌ గ్రౌండ్‌లో ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలు, శివసేన కార్యకర్తలు భారీగా తరలివస్తారని భావిస్తున్నారు. వేదికపై వంద మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మైదానంలో 70 వేల కుర్చీలు వేస్తున్నారు.
 

> బీజేపీకి మద్దతిచ్చి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ యూ టర్న్ తీసుకున్నారు. 
> కాంగ్రెస్, ఎన్సీపీ మద్దతుతో శివసేన అధికార పగ్గాలు చేపడుతోంది. 
> ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగే కేబినెట్ సమావేశంలో కొత్త స్పీకర్ ఎన్నికకు తేదీని ఖరారు చేయనున్నారు.
> ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ఏర్పడబోయే ప్రభుత్వంలో తొలి రెండున్నరేళ్లు ఎన్సీపీ… డిప్యూటీ సీఎం పదవిలో ఉండనుంది. 
> శివసేన నుంచి 15 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారని సమాచారం. ఎన్సీపీ నుంచి డిప్యూటీ సీఎం, 13 మంది మంత్రులు ఉండనుండగా.. కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ పదవితోపాటు 13 మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. 
Read More : బెంగళూరులో రూ. 50 వేల ఉల్లి బస్తాల చోరీ