భార్యకు కీలక బాధ్యత అప్పగించిన ఉద్దవ్ ఠాక్రే

  • Published By: venkaiahnaidu ,Published On : March 1, 2020 / 10:15 AM IST
భార్యకు కీలక బాధ్యత అప్పగించిన ఉద్దవ్ ఠాక్రే

శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే భార్య రశ్మి కీలక బాధ్యతలు చేపట్టారు. శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటర్‌గా ఆమె నియమితులయ్యారు. ఆదివారం వెలువడిన సామ్నా పేపర్‌లో రశ్మిని ఎడిటర్‌గా పేర్కొన్నారు . సామ్నా ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ రశ్మినే కావడం విశేషం. మరోవైపు  శివసేన సీనియర్‌ నాయకులు, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ యథావిథిగా సామ్నా కార్యనిర్వహక ఎడిటర్‌గా కొనసాగనున్నారు.

మహారాష్ట్రలో శివసేన వాయిస్‌ వినిపించాలనే లక్ష్యంతో ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే ఈ పత్రికను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. మల్టీ-ఎడిషన్ మరాఠీ ‘సామ్నా’ జనవరి 23, 1983న స్థాపించబడింది. అప్పుడు  దివంగత బాల్ థాకరేతో సంపాదకుడిగా వ్యవహరించారు. హిందీ ఎడిషన్ ‘దోపాహార్ కా సామ్నా’ఫిబ్రవరి 23, 1993న ప్రారంభించబడింది.

ఉద్దవ్‌ రాజకీయాల్లో రాణించడానికి,సీఎం అవడం వెనుక రశ్మి పాత్ర చాలానే ఉందని ఆయన సన్నిహితులు చెబుతారు. గతేడాది చివర్లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నియోజకవర్గం నుంచి తమ కుమారుడు ఆదిత్య ఠాక్రేని గెలిపించుకోవడంలో ఉద్ధవ్‌ కంటే కూడా రశ్మినే కీలక పాత్రను పోషించారని సమాచారం. 1989 డిసెంబర్‌ 13న రశ్మి, ఉద్ధవ్‌ల పెళ్లి జరిగింది. బాల్‌ ఠాక్రే ఉన్నంతకాలం ఆయనకు, పార్టీకీ అండగా ఉన్నారు రశ్మి. బాల్‌ ఠాక్రే జబ్బన పడినప్పుడు ఆయన్ని చూడ్డానికి వచ్చే శివసైనికులకు భోజనం పెట్టకుండా పంపించేది కాదు రశ్మి.