నవం­బర్-1‌ నుంచి డిగ్రీ, పీజీ క్లాస్ లు…వేసవి సెలవలు కట్

  • Published By: venkaiahnaidu ,Published On : September 22, 2020 / 05:58 PM IST
నవం­బర్-1‌ నుంచి డిగ్రీ, పీజీ క్లాస్ లు…వేసవి సెలవలు కట్

దేశవ్యాప్తంగా డిగ్రీ,పీజీ తొలి ఏడాది విద్యార్థులకు నవంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం క్యాలెండర్​ కు సంబంధించి నిపుణుల కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) ఆమోదించింది.

కరోనా కారణంగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి వేసవి, శీతాకాల సెలవులను కుదించాలని కూడా నిర్ణయం తీసుకుంది. నియంత్రణలో లేని కారణాల వల్ల ఈ విద్యా సంవత్సరానికి నష్టం వాటిల్లిందని యూజీసీ పేర్కొంది. వేసవి, శీతాకాల సెలవులను తగ్గించడం వల్ల మూడేళ్ల యూజీ/పీజీ కోర్సుల విద్యార్థులు సకాలంలో తమ కోర్సు పూర్తి చేసుకోగలుగుతారని తెలిపింది.


డిగ్రీ, పీజీ తొలి ఏడాది విద్యార్థుల కోసం తయారు చేసిన నిబంధనలను యూజీసీ ఆమోదించినట్లు విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. వాస్తవానికి, కాలేజీల పునఃప్రారంభం కోసం యూజీసీ… ప్రత్నా­మ్నాయ అకా­డ­మిక్‌ క్యాలెండ­ర్‌ను ఏప్రిల్‌ 29నే విడు­దల చేసింది. సెప్టెంబర్ నుంచి కళాశాలలను తెరవాలని సూచించింది. అయితే కరోనా తీవ్రత పెరుగుతుండటం వల్ల ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు రూపొందించింది.


సవరించిన మార్గదర్శకాలు 
–  అక్టోబర్- 31 నాటికి తొలి సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ పూర్తి.
– తొలి సెమిస్టర్​ క్లాసులు నవంబర్- 1 నుంచి ప్రారంభం.
–  వేసవి, శీతాకాల సెలవులను తగ్గించాలి.
– ఈ ఏడాది విద్యార్థులు సకాలంలో డిగ్రీ పట్టా పొందేలా వచ్చే ఏడాది విద్యా సంవత్సరాన్ని త్వరగా ప్రారంభించాలి.
– ప్రస్తుత బ్యాచ్ విద్యార్థులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలలో వారానికి ఆరు రోజుల ప్రణాళికను యూనివర్సిటీలు అమలు చేయాలి.

అంతేకాకుండా, ఈ ఏడాది విద్యా సంవ­త్స­రా­నికి సంబం­ధించి నవం­బర్‌ 30 వరకు యూని­వ­ర్సి­టీల్లో అండర్ గ్రాడ్యు­యేట్‌, పోస్ట్‌ గ్యాడ్యు­యేట్‌ కోర్సుల్లో తొలి ఏడాది అడ్మి­షన్లు రద్దు చేసు­కున్న, వలస వెళ్లిన విద్యా­ర్థు­లకు ఫీజులు తిరిగి చెల్లి­స్తా­రని కేంద్ర విద్యా­శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. కరోనా నేప­థ్యంలో విద్యా­ర్థుల తల్లి­దం­డ్రు­లపై మరింత భారం పడ­కూ­డ­దన్న ఉద్దే­శంతో ఈ ఒక్క­సా­రికి ప్రత్యే­కంగా ఈ మేరకు అవ­కాశం కల్పించినట్లు చెప్పారు.