ఢిల్లీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల…నిరుద్యోగులకు నెలకు 7వేల 500

  • Published By: venkaiahnaidu ,Published On : February 2, 2020 / 11:58 AM IST
ఢిల్లీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల…నిరుద్యోగులకు నెలకు 7వేల 500

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ(ఫిబ్రవరి-2,2020)కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ సుభాష్ చోప్రా,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆనంద్ శర్మ,అజయ్ మాకెన్ లు కలిసి ఇవాళ ఢిల్లీలో మేనిఫెస్టోని విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా సుభాష్ చోప్రా మాట్లాడుతూ…కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  నెలకు 300యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. అంతేకాకుండా ప్రతిఏటా 25శాతం బడ్జెట్ ను కాలుష్యంపై పోరాడటానికి,రవాణ సౌకర్యాలు మెరుగుపర్చడానికి ఖర్చు చేస్తామని తెలిపారు. 

యువ స్వాభిమాన్ యోజన పథకం పెట్టి దాని ద్వారా నిరుద్యోగ అలవెన్స్ కింద గ్యాడ్యుయేట్స్ కి ప్రతినెలా రూ.5,000,పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి ప్రతినెలా రూ.7,500 ఇస్తామని సుభాష్ చోప్రా తెలిపారు. పార్టీ అధికారంలోకి వస్తే 100 ఇందిరా క్యాంటీన్లు ప్రారంభించి రూ.15కే భోజనం అందిస్తామని అన్నారు. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా నీటి సరఫరా,విద్యుత్ వనరులను ఆదా చేయడం కోసం కాంగ్రెస్ ప్రధాన క్యాష్‌బ్యాక్ పథకాలను ప్రారంభిస్తుందని తెలిపారు. సీఏఏను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని,ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తామన్నారు.ఎన్ఆర్సీ ని కూడా ఢిల్లీలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్  అమలు చేయదని సుభాష్ చోప్రా తెలిపారు.

 ప్రచారం తీవ్రతరం
ఇప్పటికే ఆప్-బీజేపీలో ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కాంగ్రెస్ మాత్రం పూర్తిగా వెనుకబడిపోయింది. గతేడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఢిల్లీలో ఓటింగ్ శాతంలో బీజేపీ తర్వాత రెండో స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ కాంగ్రెస్ జోరు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కనబడటం లేదు. ఇక ఇప్పుడు మేనిఫెస్టో విడుదల అయింది. సోమవారం ఇక ఢిల్లీలో కాంగ్రెస్ ప్రచారంలో టాప్ గేర్ లో దూసుకెళ్లే అవకాశముంది.  ఫిబ్రవరి-4న జంగ్ పురా,సంగమ్ విహార్ ప్రాంతాల్లో,ఫిబ్రవరి-5,2020న కొండ్లి,హౌజ్ ఖాజీ ఏరియాల్లో నిర్వహించే ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించనున్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా ప్రచార ర్యాలీల్లో పాల్గొననుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఢిల్లీలో ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆర్జేడీ కలిసి పోటీ చేస్తున్న సమయంలో ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 

ఫిబ్రవరి-8,2020న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి-11న ఫలితాలు వెలువడనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఢిల్లీలో ఖాతా కూడా తెరవలేకపోయింది. అప్పుడు బీజేపీ కేవలం 3సీట్లతో సరిపెట్టుకోగా…మొత్తం 70స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 67సీట్లు వచ్చాయి. ఇక ఈసారి తమ సంఖ్య పెంచుకొని అధికారం చేపడతామని బీజేపీ అంటుండగా,ప్రజలు తమవైపే ఉన్నారని కేజ్రీవాల్ అంటున్నారు. ఇక దశాబ్దాలపాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయి ప్రచారంలోకి దిగినట్లు కన్పించడం లేదు.