3-18 ఏళ్ల వయసున్న వారికి ఉచిత, నిర్భంద విద్య, నూతన విద్యా విధానానికి కేంద్రం ఆమోదం

  • Published By: venkaiahnaidu ,Published On : July 29, 2020 / 05:11 PM IST
3-18 ఏళ్ల వయసున్న వారికి ఉచిత, నిర్భంద విద్య, నూతన విద్యా విధానానికి కేంద్రం ఆమోదం

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం(జులై-29,2020) సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. నాలుగు దశల్లో నూతన జాతీయ విద్యా విధానం ఉండనున్నట్టు తెలుస్తోంది. 5+3+3+4 విధానంలో విద్యా విధానం అమలులోకి రానున్నట్టు సమాచారం.



కొత్త విధానం ద్వారా దేశంలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు తమ ప్రాంగణాలను నెలకొల్పేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఉన్నత విద్యా విధానంలో సమూల మార్పులకు ఈ కొత్త విధానం శ్రీకారం చుట్టనుంది. 3 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి ఉచిత, నిర్భంద విద్యను అందించడమే లక్ష్యంగా కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.


కొత్త విద్యా విధానంలో సిలబస్ వంటి అంశాలు కూడా పూర్తిగా మారిపోనున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. వృత్తి, ఉపాధి లభించే విధంగా విద్యా వ్యవస్థను మార్చనున్నట్టు తెలుస్తోంది. ఈ విధానంలో మొదటి ఐదేళ్లలో ఫౌండేషన్ కోర్సుగా పరిగణిస్తారని సమాచారం. ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ మరియు గ్రేడ్ 1, గ్రేడ్ 2గా పరిగణించనున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ రాష్ట్రస్థాయి స్కూల్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.

అదేవిధంగా, మానవ వనరులశాఖ పేరును విద్యా శాఖగా మారుస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్​. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ (హెచ్‌ఆర్డీ) శాఖ పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చే ప్రతిపాదనను బుధవారం కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది.ఇస్రో మాజీ చీఫ్‌ కే కస్తూరిరంగన్‌ సారథ్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ తొలుత మంత్రిత్వ శాఖ పేరు మార్చాలని సిఫార్సు చేసింది. నూతన విద్యా విధానం డ్రాఫ్ట్‌లో ఇది కీలక సిఫార్సు కావడంతో పేరు మార్పునకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. విద్య, బోధన, సాధన ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించే దిశగా హెచ్‌ఆర్డీ శాఖను విద్యా మంత్రిత్వ శాఖగా మార్చాలని ఈ కమిటీ సూచించింది.