అది నోరేనా : కాంగ్రెస్ నేత భార్యనూ వదలని హెగ్డే

  • Published By: venkaiahnaidu ,Published On : January 28, 2019 / 09:52 AM IST
అది నోరేనా : కాంగ్రెస్ నేత భార్యనూ వదలని హెగ్డే

కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే  ఆదివారం(జనవరి 26, 2019) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కర్ణాటకలోని కొడగు జిల్లాలో నిర్వహించిన  ఓ బహిరంగ కార్యక్రమంలో  పాల్గొన్న అనంత్ కుమార్ మాట్లాడుతూ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మహిళను పట్టుకొన్న ఏ చెయ్యి అయినా సరే తెగి పడిపోవాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తాజ్ మహల్ ని కూడా ముస్లింలు నిర్మించలేదని అన్నారు. చరిత్రే ఇందుకు సాక్ష్యమని తెలిపారు. రాజా జయసింహ నుంచి ఆ స్థలాన్ని తాను పొందినట్లు షాజహాన్ తన జీవిత్ర చరిత్రలో తెలిపారని, తాజ్ మహల్ ఒకప్పుడు శివాలయం అని, రాజా పరమతీర్థ దానిని నిర్మించారని హెగ్డే తెలిపారు. తేజో మహాలయ తాజ్ మహల్ గా మారిందని అన్నారు.

 

మనం ఇలాగే నిద్రపోతూ ఉంటే మనందరి ఇళ్లు కూడా మంజిల్ గా పేరు మార్చేస్తారని, రాముడిని జహాపన, సీతాదేవిని బీబీగా పిలుస్తారని హెగ్డే అన్నారు. అయితే హెగ్డే వ్యాఖ్యలను కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దినేష్ గుండురావ్ తప్పుబట్టారు. హెగ్డే వ్యాఖ్యలు దిగజారుడుతనంగా ఉన్నాయని విమర్శించారు. ఎంపీగా లేదా కేంద్రమంత్రిగా రాష్ట్రానికి అనంత్ కుమార్ హెగ్డే సాధించిందేమిటని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇటువంటి వారు మంత్రులవడం చాలా దురుదృష్టకరమని తాను చెప్పదల్చుకొన్నానని దినేష్ గుండారావ్  ట్వీట్ చేశారు.

అయితే సోమవారం(జనవరి 28, 2019) మరోసారి అనంత్ కుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  దినేష్ భార్యను టబు రావ్ అని సంభోధిస్తూ పర్శనలో ఎటాక్ కి దిగారు. ముస్లిం మహిళ వెనుక పరిగెత్తిన ఓ వ్యక్తిగానే దినేష్ గుండురావ్ తనకు తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత విషయాలపై  అనంత్ కుమార్ దిగజారుడు వ్యాఖ్యలు చూసి భాధ కల్గుతోందని దినేష్ మరో ట్వీట్ లో తెలిపారు. నాగరికత కొరతకారణంగానే హెగ్డే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని తాను భావిస్తున్నానని దినేష్ అన్నారు. మన హిందూ గ్రంథాల నుంచి హెగ్డే ఏమీ నేర్చుకోలేదని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. సమయం ఇంకా మించిపోలేదని, గౌరనీయమైన మనిషిగా అతడు మారడానికి ఇంకా ప్రయత్నించవచ్చని అన్నారు.

2017లో కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న అనంత్ కుమార్ హెగ్డే గత నెలలో కూడా శబరిమల ఇష్యూకి సంబంధించి కేరళ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ ప్రభుత్వం హిందువులపై పట్టపగలే రేప్ చేస్తోందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.