మరిన్ని సడలింపులతో అన్‌లాక్ 5. 0…తెరుచుకోనున్న థియేటర్లు!

10TV Telugu News

అన్‌లాక్ 5. 0 మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ మంగళవారం విడుదల చేసే అవకాశముంది. అక్టోబర్-1 నుంచి అన్‌లాక్ ఐదో దశ ప్రారంభం కానుంది. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో అన్‌లాక్ 5. 0 గైడ్ లైన్స్ పై అందరూ దృష్టి సారిస్తున్నారు.


కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం వివిధ దశల్లో సడలిస్తోన్న విషయం తెలిసిందే. జూన్ నెల నుంచి అన్‌లాక్ మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేస్తోంది. గత నెలలోనే అన్‌లాక్ 4. 0లో భాగంగా చాలా వరకు ఆంక్షలను కేంద్ర హోం శాఖ సడలించింది. కంటైనర్ జోన్లు మినహాయించి అన్ని ప్రాంతాల్లో కార్యకలాపాలకు అనుమతిచ్చింది. తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులు పాఠశాలలకు రావడానికి అనుమతిచ్చింది. మెట్రో సేవలను తిరిగి ప్రారంభించడానికి రాష్ర్టాలకు అనుమతిచ్చింది. 100 మంది వరకు పాల్గొనే ఆటల పోటీలు, సామాజిక, విద్యా, వినోదం, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు, రాజకీయ సదస్సులు నిర్వహించడానికి కేంద్ర హోంశాఖ అనుమతులు ఇచ్చింది.కానీ సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు ఇంకా తెరవలేదు.


అయితే, అక్టోబర్-1 నుంచి ప్రారంభం కానున్న అన్‌లాక్ 5. 0 లో ఆంక్షలను మరింత సడలిస్తారని అందరూ ఆశిస్తున్నారు. దాదాపు అన్ని రకాల ఆంక్షలు తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అన్‌లాక్ 5 లో సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు తెరుచుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సినిమా థియేటర్లపై నిర్ణయం తీసుకోవాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రభుత్వాన్నిపలుమార్లు అభ్యర్థించింది. అక్టోబరు నుంచి వీటి నిర్వహణకు అనుమతిస్తారని ఆ సంస్థ ఆశిస్తుంది. అన్‌లాక్- 5లో పర్యాటక ప్రదేశాలకు యాత్రికులను అనుమతించే అవకాశం కూడా ఉంది.


మరోవైపు,అక్టోబర్ 1 నుంచి సినిమా హాళ్లు తెరవడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. కానీ పరిమిత సంఖ్యలోనే థియేటర్లోకి ప్రేక్షకులను అనుమతించనున్నారు. నాటకాలు, జాతరలు, సినిమాలు, అన్ని సంగీత, నృత్య ప్రదర్శనలు, మేజిక్ షోలు.. వంటి వాటిల్లో 50 మందిలోపు పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకొని నిర్వహించుకోవచ్చని ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటి అన్ని కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆమె చెప్పారు.

×