పెళ్లికాని జంట ఒకే గదిలో ఉండటం నేరం కాదు : మద్రాసు హై కోర్టు

  • Published By: chvmurthy ,Published On : December 8, 2019 / 03:22 AM IST
పెళ్లికాని జంట ఒకే గదిలో ఉండటం నేరం కాదు : మద్రాసు హై కోర్టు

పెళ్లి కాని జంట ఒకే గదిలో ఉండటం నేరమని చట్టంలో ఎక్కడా చెప్పలేదని మద్రాసు హైకోర్టు తేల్చి చెప్పింది. కోయంబత్తూరులోని లాడ్జిగదిలో అవివాహిత జంట ఉన్నారని, మరో గదిలో మద్యం సీసాలు లభించాయనే కారణాలు చూపి జిల్లా అధికారులు ఒక లాడ్జిని  సీజ్ చేశారు. దీన్నిసవాల్ చేస్తూ లాడ్జి యాజమాన్యం మద్రాసు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. పిటీషన్ విచారించిన న్యాయమూర్తి ఎం.ఎస్.రమేష్ పోలీసులు చెప్పే కారణాలతో ఏకీభవించలేమని , అవివాహిత స్త్రీ, పురుషులు ఒకే గదిలో ఉండకూడదనే చట్టంలో ఎక్కడా లేదని అటువంటప్పుడు అది ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు.

లివింగ్ టు గెదర్ విధానంలో సహజీవనాన్ని నేరంగా ఎలా పరిగణించలేమో,  లాడ్జిలోని ఒకే గదిలో అవివాహిత జంట ఉండటాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేశారు.  పెళ్లి కాని ఇద్దరు పెద్దవాళ్లు ఒకే గదిలో ఉండటం, గదిలో మద్యం బాటిళ్లు ఉన్నాయని అనధికార బార్ నడుస్తోందని చెప్పి… ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా  లాడ్జిని సీలు చేయటంపై  హైకోర్టు ఆశ్ఛర్యం వ్యక్తం చేసింది.

పెళ్లి కాని జంటలను హోటల్ లోకి అనుమతించడంలో చట్టవిరుధ్ధం ఏమిటని పోలీసులను కోర్టు  ప్రశ్నించింది. ఇందుకు పోలీసు వారి నుంచి సమాధానంలేక పోవటంతో లాడ్జిని తిరిగి తెరవాలని  మద్రాసు హై కోర్టు ఆదేశించింది. లాడ్జి సీజ్ చేసే ముందు అధికారులు నిర్వాహకులు నుంచి సరైన వివిరణ తీసుకుని ఉండాల్సిందని  కోర్టు అభిప్రాయపడింది.

అలాగే లైసెన్స్ లేకుండా హోటల్ లో మద్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలను కోర్టు కొట్టివేసింది. 1996 నాటి తమిళనాడు మద్యం చట్టం ప్రకారం ప్రతి వ్యక్తి స్వదేశంలో తయారైన విదేశీ మద్యం లీటరు, ఏడు లీటర్ల బీరు, 9 లీటర్లు వైన్ కలిగి ఉండటానికి అనుమతి ఇచ్చిందని వివరించింది. కనుక లాడ్జి మూసివేతకు సరైన నిబంధనలు పాటించనందున…లాడ్జికి వేసిన సీలు రెండురోజుల్లో తొలగించాలని కోయంబత్తూరు కలెక్టర్ ను న్యాయమూర్తి ఆదేశించారు.