కాంగ్రెస్ కు కరోనా వైరస్….జైరాం రమేష్

  • Published By: venkaiahnaidu ,Published On : February 14, 2020 / 09:34 AM IST
కాంగ్రెస్ కు కరోనా వైరస్….జైరాం రమేష్

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమిని కరోనా వైరస్ తో పోల్చారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ జైరాం రమేష్. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా కరోనా వైరస్ సోకినట్లుగా ఎన్నికల్లో భారీగా నష్టం జరిగిందని జైరాం రమేష్ అన్నారు.  ఢిల్లీ ఎన్నికల్లో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), షహీన్‌బాగ్‌ నిరసనల్ని ప్రచార అస్త్రంగా చేసుకొని బీజేపీ ఓట్లను చీల్చడం వల్ల ఆ పార్టీ గెలవలేదు కానీ, ఎక్కువ నష్టం కాంగ్రెస్ పార్టీకి జరిగిందన్నారు.

మైనార్టీ మతవాదంపై కాంగ్రెస్‌ పార్టీ సామరస్య ధోరణితో ఉంటుందన్న ప్రచారంపై జైరామ్‌ రమేష్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం మతవాదంపై తాము చూసీ చూడనట్టు వ్యవహరిస్తామన్న దుష్ప్రచారం సాగుతోందని జైరామ్‌ రమేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మెజార్టీ ప్రజల మనోభావాల పట్ల కూడా సున్నితంగా వ్యవహరించాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఏకే ఆంటోని చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

ఢిల్లీలో 2015 అసెంబ్లీ ఎన్నికలు,2020 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 70స్థానాల్లో ఒక్క సీటు కూడా రాలేదు. అసులు మూడు స్థానాల్లో తప్ప మొన్న జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులందరూ డిపాజిట్లు కూడా కోల్పోయారు. గాంధీ నగర్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ,బద్లి స్థానం నుంచి దేవేందర్ యాదవ్,కస్తూర్భానగర్ నుంచి అభిషేక్ దుత్త్ లు మాత్రమే డిపాజిట్లు దక్కించుకోగలిగారు.

ఫిబ్రవరి-11,2020న విడుదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 70స్థానాల్లో ఆప్ 62సీట్లు గెల్చుకున్న విషయం తెలిసిందే. బీజేపీ కేవలం 8స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేదు. మరో కొత్త విషయం ఏంటంటే 2015లో 9.7శాతం ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్,మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం4.26శాతం ఓట్లు మాత్రమే దక్కించుకుంది.

మా ఢిల్లీ ముద్దు బిడ్డ అంటూ కేజ్రీవాల్ కు దేశరాజధాని ప్రజలు గంపగుత్తుగా ఓట్లు వేశారు. ఫలితంగా మొత్తం 70స్థానాల్లో 62సీట్లలో ఘన విజయం సాధించి సామాన్యుడి సత్తా చాటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 67సీట్లను ఆప్ సాధించిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో 3స్థానాలకే పరిమితమైన బీజేపీ,ఈసారి మాత్రం కొంచెం కష్టపడి ఆ సంఖ్యను 8కి చేర్చుకుంది. ఫిబ్రవరి-11,2020న విడుదలైన ఢిల్లీ ఫలితాల్లో బీజేపీ 8సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే.

Read Here>>డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్