INS విశాఖపట్నం యుద్ధ నౌకను ప్రారంభించిన రాజ్ నాథ్..చైనాపై ఘాటు వ్యాఖ్యలు

భారతదేశ సముద్ర తీరంలో ఎంతో వ్యూహాత్మకమైన తూర్పు తీర రక్షణను మరింత పటిష్ఠం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. తూర్పు సముద్ర తీర పరిరక్షణలో కీలక పాత్ర పోషించనున్న యుద్ధ నౌక

INS విశాఖపట్నం యుద్ధ నౌకను ప్రారంభించిన రాజ్ నాథ్..చైనాపై ఘాటు వ్యాఖ్యలు

Ins

INS  Visakhapatnam : భారతదేశ సముద్ర తీరంలో ఎంతో వ్యూహాత్మకమైన తూర్పు తీర రక్షణను మరింత పటిష్ఠం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. తూర్పు సముద్ర తీర పరిరక్షణలో కీలక పాత్ర పోషించనున్న యుద్ధ నౌక INS​-విశాఖపట్నం విధుల్లోకి చేరింది. ముంబైలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ నౌకను జాతికి అంకితం చేశారు. హిందూ మహాసముద్రంలో చైనా దూకుడు నేపథ్యంలో బ్రహ్మోస్‌ సహా అనేక అధునాతన క్షిపణులను ప్రయోగించేలా తీర్చిదిద్దిన ఈ నౌక.. విధుల్లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నౌకను విశాఖపట్నంలో మోహరించనున్నారు.

ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను ప్రాజెక్టు 15బీలో భాగంగా ముంబైలోని మజగావ్ షిప్ బిల్డర్స్ దేశీయంగా నిర్మించింది. ఇది దేశపు తొలి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ నౌక. బ్రహ్మోస్‌ సూపర్‌ సోనిక్‌ క్షిపణులతో సహా పలు రకాల క్షిపణులను దీని నుంచి ప్రయోగించవచ్చు. ఈ నౌక కదలికల్ని శత్రుదేశ రాడార్లు గుర్తించలేని విధంగా అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. జలాంతర్గాములను కూడా గుర్తించి దాడి చేయడానికి వీలుగా శక్తిమంతమైన టోర్పెడోలను ఏర్పాటు చేశారు. రెండు మల్టీరోల్‌ హెలికాప్టర్లు ఇందులో ఉంటాయి.

కాగా, నౌకలకు ప్రముఖ నగరాల పేర్లను పెట్టే సంప్రదాయానికి అనుగుణంగా విశాఖకు కేటాయించిన ఈ నౌకకు ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం అని నామకరణం చేశారు. ఇటువంటి నాలుగు నౌకలను తయారు చేస్తారు. వీటిలో మొదటిదానిని ఆదివారం జల ప్రవేశం చేయించారు. ఈ నేపథ్యంలో ‘మేక్ ఇన్ ఇండియా’కు మరింత బలం చేకూరిందని ప్రభుత్వం పేర్కొంది.

INS​-విశాఖపట్నం యుద్ధ నౌక ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ..ఈ నౌక జల ప్రవేశంతో ప్రాచీన, మధ్య యుగాలనాటి భారత దేశ సముద్ర రంగ శక్తి, సామర్థ్యాలు, నౌకా నిర్మాణ నైపుణ్యాలు, ప్రతిష్ఠాత్మక చరిత్ర గుర్తుకొస్తున్నాయన్నారు. భావి అవసరాలకు తగినట్లుగా INS​-విశాఖపట్నం యుద్ధ నౌకను తయారు చేసినట్లు చెప్పారు. దేశం కోసం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల అవసరాలను తీర్చేందుకు నౌకలను నిర్మించే సత్తా భారత దేశానికి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్య దేశాల ప్రయోజనాలకు రక్షణ ఉండేవిధంగా చట్టబద్ధ నిబంధనలు అమలుకావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నౌకాయానం స్వేచ్ఛగా జరగాలని, సార్వత్రిక నియమాలు అమలు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతం భద్రత విషయంలో భారత దేశం చాలా ముఖ్యమైనది కావడం వల్ల భారత నావికా దళం పాత్ర మరింత ముఖ్యమైనదిగా మారిందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా భద్రతా వ్యయం 2023 నాటికి 2.1 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనా ఉందని, కాబట్టి భారత్  తన శక్తి, సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు, స్వదేశీ నౌకా నిర్మాణ కేంద్రంగా మన దేశాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉందన్నారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే పథకం ‘మేక్ ఇన్ ఇండియా’ వల్ల భారత నావికా దళం 2014లో 76 శాతం ఎయిర్ ఆపరేషన్స్ నెట్, 66 శాతం కాస్ట్ బేసిస్ కాంట్రాక్టులను మన దేశంలోని అమ్మకందారులకు అప్పగించినట్లు తెలిపారు. నావికా దళ ఆయుధాల్లో 90 శాతం వరకు స్వదేశీ ఆయుధాలను సమకూర్చుకునే అవకాశం కలిగిందన్నారు.

ఇక, ఈ సందర్భంగా చైనాపై పరోక్ష విమర్శలు గుప్పించారు రాజ్ నాథ్. దేశాల ప్రాదేశిక సముద్ర జలాల పరిరక్షణ కోసం రూపొందించిన ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ చట్టం.. అన్‌ క్లాజ్‌కు చైనా కొత్త భాష్యాలు చెబుతూ దాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. “1982-ఐరాస కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ చట్టం అన్‌క్లాజ్‌.. దేశాల ప్రాదేశిక సముద్ర జలాల పరిరక్షణ సహా, సముద్రంలో నిబంధనలను అనుసరించాలని ప్రతిపాదించింది. కాని కొన్ని దేశాలను నేను బాధ్యతారాహిత్య దేశాలు అని పిలవాలని భావిస్తున్నాను. ఆ దేశాలు తమ సంకుచిత, పక్షపాత ప్రయోజనాలు, ఆధిపత్య ధోరణులతో అన్‌క్లాజ్‌ వంటి అంతర్జాతీయ చట్టాలకు కొత్త కొత్త నిర్వచనాలు ఇస్తున్నాయి. వ్యవస్థ దృష్టిలో ఆ చట్టంలోని నిబంధనలు చాలా కీలకమైనవి. కాని కొన్ని దేశాలు తమకు తోచిన వ్యాఖ్యలు చేస్తూ ఈ నిబంధనలను తరచూ బలహీనపరుస్తున్నాయి” అని రాజ్ నాథ్ విమర్శించారు.

ALSO READ Rajasthan Politics: రాజస్థాన్ రాజకీయంలో పెను మార్పులు